21 August, 2026 | 1:46 AM

రేవంత్ సర్కార్ నెత్తిన చెయ్యి!

21-08-2026 01:03 AM
  1. ఒకవైపు 22 ఏలో తప్పులు.. పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన
  2. మరోవైపు కాంగ్రెస్‌లో కుమ్ములాటలు

మెదక్ బ్యూరో, ఆగస్టు 20 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రెండున్నర ఏళ్లు పూర్తి చేసుకునే లోపే తీవ్రమైన రాజకీయ, సామాజిక ప్రతిఘటనను ఎదుర్కొంటోంది. ప్రతిపక్షాలైన బీఆర్‌ఎస్, బీజేపీల నుంచి వస్తున్న వ్యూహాత్మక దాడులు, క్షేత్రస్థాయిలో ప్రజల్లో కనిపిస్తున్న అసంతృప్తి ఈ సంక్షోభానికి ప్రధా న కారణాలుగా మారుతున్నాయి.

ఈ తరుణంలో ప్రస్తుత పరిస్థితులు ప్రభుత్వ పరిపాలనా వైఫల్యమా లేక పార్టీ నేతల వ్యూహాత్మక లోపాలు, అంతర్గత కలహాల వల్ల జరిగిన స్వయం కృతాపరాధమా అనే అనుమానం ప్రజల్లో కలుగుతోంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, ప్రజాస్వామ్య పునరుద్ధరణ వంటి హామీలు ప్రజల్లో భారీ అంచనాలను పెంచాయి. అయితే ఆచరణలోకి వచ్చేసరికి ప్రభుత్వం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది.

రైతు భరో సా, రుణమాఫీ, నిరుద్యోగ భృతి వంటి ప్రధాన హామీల అమలులో నత్తనడకను ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో పడిందని, సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఏర్పడిందని ఇటు బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు.. అటు బీజేపీ నేతలు నిరంతరం విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు నిలిచిపోవడం విద్యార్థు ల్లో అసంతృప్తిని పెంచింది. ఇప్పుడు ‘శక్తిలో చేర్చవద్దని పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు కూడా దీనికి తోడయ్యాయి.

రెవెన్యూ సమస్యల గందరగోళం..

22- ఏ నిషేధిత భూముల జాబితాలో త ప్పులు దొర్లడం, ధరణి స్థానంలో తెచ్చిన కొ త్త వ్యవస్థలో తడబాట్లు ప్రజలకు ఇబ్బందిగా మారాయి. ఈ పరిణామాలు ప్రభుత్వ యం త్రాంగంపై పట్టు లేమిని సూచిస్తూ పాలనా వైఫల్యం వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. పరిపాలనాపరమైన సవాళ్లు ఒకవైపు ఉంటే, కాంగ్రెస్ తన సొంత నిర్ణయాలు,  అంతర్గత విబేధాల ద్వారా ప్రతిపక్షాలకు ఆయుధాలను అందిస్తోందనే వాదన బలంగా వినిపి స్తోంది.

ఇది స్వయం కృతాపరాధమే. మరోవైపు ప్రతిపక్షాల కంటే సొంత పార్టీ ఎమ్మెల్యే లు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం గమనార్హం. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు అవినీతి ఆరోపణలు చేయడం, మంత్రి పదవుల కేటాయింపులపై అసంతృప్తి వ్యక్తం చేయడం ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసింది.

నైతిక విలువలతో కూడిన పాలన అందిస్తామని చెప్పి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడం వల్ల పాత కాంగ్రెస్ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి రేగింది. ఇది హైకోర్టు మె ట్లు ఎక్కడం, రాజకీయంగా నైతికతను కో ల్పోవడం వంటి పరిస్థితులకు దారితీసింది. ప్రతిపక్షాల నిరసనలపై ఆంక్షలు విధించడం, హౌస్ అరెస్టులు చేయడం ద్వారా కాంగ్రెస్ తన ‘ఏడో గ్యారెంటీ’ అయిన ప్రజాస్వామ్య పునరుద్ధరణను తానే కాలరాస్తోందని విమర్శలు ఎదుర్కొంటోంది.

ప్రజల్లో అసహనం..?

ఆరు గ్యారెంటీల పూర్తి స్థాయి అమలు, ముఖ్యంగా ’రైతు భరోసా’ నిధుల విడుదల, నిరుద్యోగులకు పూర్తి స్థాయిలో ఉద్యోగ నియామకాలు జరగకపోవడం వల్ల ఓటు వేసిన ప్రజల్లో అసహనం పెరుగుతోంది. ఇది ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీస్తోం ది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, ధరణి సమస్యలు, స్థానిక మౌలిక వసతుల లేమిపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించకపోతే, ఇది రా బోయే స్థానిక సంస్థలు, గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బగా మారే ప్ర మాదం ఉంది.

ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్, బీజేపీలు ఉమ్మడిగా పోరాటాలు చేస్తూ క్షేత్రస్థాయిలో మైలేజ్ సాధిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలను గాలికొదిలేశారనే ప్ర చారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నాయి. ఇలావుండగా కాంగ్రెస్ పార్టీకి మొదటి నుం చి ఉన్న అతిపెద్ద బలహీనత ’అంతర్గత కలహాలు’. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇది మ రింత బహిర్గతమై తీవ్ర ప్రభావం చూపుతోం ది.

మంత్రి పదవులు దక్కని సీనియర్ నేతలు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగంగానే ప్రభుత్వంపై, అవినీతిపై వ్యాఖ్యలు చే యడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టును బలహీనపరుస్తోంది. సీఎం ఆదేశాలను కూ డా కొందరు నేతలు ఖాతరు చేయడం లేద నే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. నియోజకవర్గాల్లో పాత, కొత్త నేతల మధ్య గ్రూపు రాజకీయాలు పెరిగి, క్రమశిక్షణ పూర్తిగా తప్పింది. ఇది పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలహీనపరుస్తోంది.

ప్రజా సమస్యలపై దృ ష్టి పెట్టాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులు.. నిరంతరం సొంత పార్టీ నేతల అసంతృప్తిని చల్లార్చడానికే, ఢిల్లీ పర్యటనలకే ఎక్కువ స మయం కేటాయించాల్సి వస్తోంది. దీనివల్ల పరిపాలన పూర్తిగా కుంటుపడుతోందనే ప్రచారం సాగుతోంది. తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితిని పరిశీలిస్తే, ఇది కేవలం పరిపాలనా వైఫల్యం మాత్రమే కా దు, అంతకంటే ఎక్కువ స్వయం కృతాపరాధం అని స్పష్టమవుతోంది.

ఆర్థిక వనరుల ను అంచనా వేయకుండా ఇచ్చిన హామీలు ఒకెత్తయితే, పార్టీలోని అంతర్గత విభేదాలను, అసంతృప్తిని చక్కదిద్దడంలో అధిష్టా నం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఫల్యం చెం దడం ప్రతిపక్షాలకు పెద్ద ఆయుధంగా మా రింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నే పథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి ఉంది.

సొంత పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటూ, హామీ ల అమలుపై స్పష్టమైన రోడ్ మ్యాప్‌తో ముందుకు వెళ్తేనే ఈ రాజకీయ, సామాజిక దాడుల నుంచి ప్రభుత్వం గట్టెక్కగలదు. లేనిపక్షంలో, ఈ స్వయంకృతాపరాధాలే ప్రభుత్వానికి గుదిబండలుగా మారే ప్రమాదం ఉంది.