21 August, 2026 | 4:14 AM

వికసిత్ భారత్ లక్ష్యంలో మరో ముందడుగు.. అలంపూర్‌కు ఆధునిక రైల్వే రూపం

21-08-2026 01:26 AM

రూ.6.07 కోట్లతో శ్రీ బాలబ్రహ్మేశ్వర జోగులాంబ రైల్వే హాల్ట్ పునరాభివృద్ధి పనులు పూర్తి

పుణ్యక్షేత్రాలకు మెరుగైన కనెక్టివిటీ.. పర్యాటక అభివృద్ధికి ఊతం 

అలంపూర్, ఆగస్టు 20: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవ శక్తిపీఠంగా ప్రసిద్ధిగాంచిన అలంపూర్ శ్రీ జోగులాంబ అమ్మవారి, శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలకు రైల్వే కనెక్టివిటీ మరింత ఆధునిక రూపు సంతరించుకుంది. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన శ్రీ బాలబ్రహ్మేశ్వర జోగులాంబ రైల్వే హాల్ట్ పునరాభివృద్ధి పనులు రూ.6.07 కోట్ల వ్యయంతో వంద శాతం పూర్తయ్యాయి.

ఆధునిక వసతులతో అభివృద్ధి చేసిన హాల్ట్ భక్తులు,ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించనుంది. పునరాభివృద్ధిలో భాగంగా హై లెవల్ ప్లాట్ఫాం, ఆకర్షణీయమైన ఎంట్రెన్స్ ఆర్చ్, ఆధునిక స్టేషన్ భవనం, ప్లాట్ఫాం కవర్, తాగునీటి సౌకర్యం, డ్రైనేజీ తదితర వసతులు కల్పించారు. దీంతో రైలు ప్రయాణికులకు గతంలో ఉన్న ఇబ్బందులు తగ్గడంతో పాటు పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు  సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతి కలగనుంది.

పర్యాటక అభివృద్ధికి ఊతం

జోగులాంబ అమ్మవారి దర్శనానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. రైల్వే హాల్ట్ ఆధునికీకరణతో పుణ్యక్షేత్రానికి రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. మెరుగైన రైల్వే సౌకర్యాలు భక్తుల రాకను పెంచడంతో పాటు అలంపూర్ పర్యాటక, వాణిజ్య రంగాల అభివృద్ధికి కూడా ఊతమిస్తాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటనపై ఆసక్తి

కేంద్ర ప్రభుత్వం పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.ఈ నేపథ్యంలో ఈ నెల చివరన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి గద్వాలతో పాటు అలంపూర్ శ్రీ బాలబ్రహ్మేశ్వరజోగులాంబ రైల్వే హాల్ట్ను సందర్శించనున్నట్లు బీజేపీ సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది.ఆయన పర్యటనపై స్థానికంగా ఆసక్తి నెలకొంది. 

అలంపూర్ శ్రీ జోగులాంబ అమ్మవారి, బాలబ్రహ్మేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు రైల్వే హాల్ట్ ఆధునికీకరణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రూ.6.07 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తికావడం హర్షణీయమని, మెరుగైన రైల్వే సౌకర్యాలతో అలంపూర్కు వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగి భవిష్యత్లో అలంపూర్ను మరింత ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు దోహదపడుతుంది.

 రెడ్డి, కోయిలదిన్నె