21 August, 2026 | 1:18 AM

చర్చలతోనే నీటి వివాదాలకు చెక్

21-08-2026 12:44 AM

దేశ పురోగతికి దక్షిణ రాష్ట్రాలే ప్రధాన స్తంభాలు

ప్రధాన నదులను అనుసంధానిస్తే.. రాబోయే 100 ఏళ్లపాటు భారత్‌లో నీటి కొరత ఉండదు

హోంమంత్రి అమిత్‌షా ప్రతిపాదనకు దక్షిణ రాష్ట్రాల మద్దతు

సౌత్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న తమిళనాడు, కేరళం, కర్ణాటక, ఏపీ సీఎంలు విజయ్, వీడీ సతీశన్, డీకే శివకుమార్, చంద్రబాబు

చెన్నై, ఆగస్టు 20: దక్షిణ ప్రాంత ముఖ్యమంత్రుల సమావేశంలో, చర్చల ద్వారా పెండింగ్‌లో ఉన్న నీటి వివాదాలను పరిష్కరించాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రతిపాదనకు దక్షిణాది రాష్ట్రాలు గురువారం మద్దతు తెలిపాయి. ఈ సమావేశంలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశాన్ని కూడా పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వాలు లేవనెత్తాయి. నియోజకవర్గాల పునర్విభజన అంశం ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చింది.

లోక్‌సభలోని 543 స్థానాల ప్రస్తుత స్థితిని (స్టేటస్ కో) మరో 25 ఏళ్లపాటు కొనసాగించాలని కర్ణాటక, తమిళనాడు స్పష్టం చేశాయి. తమ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడం తప్పేమీ కాదని అమిత్‌షా పేర్కొన్నారు. అయితే, ఆ ప్రయోజనాలను కాపాడుకునే క్రమంలో నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతుంటే, రాష్ట్రాలకు నీరు దక్కకుండా పోతుంటే, దానివల్ల నిజమైన ప్రయోజనం ఏమీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. బ్రహ్మపుత్ర నుంచి కావేరి, గోదావరి వరకు ప్రధాన నదులను అనుసంధానించడం ద్వారా, రాబోయే 100 ఏళ్లపాటు భారతదేశంలో నీటి కొరత లేకుండా చూడవచ్చని ఆయన చెప్పారు.

‘ఈ చొరవ అనేక జలమార్గాల ఏర్పాటుకు కూడా దోహదపడుతుంది. దీనివల్ల ఇంధనం ఆదా అవ్వడమే కాకుండా పర్యావరణం మెరుగుపడుతుంద న్నారు. తక్కువ ఖర్చుతో కూడిన రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. దేశ పురోగతికి దక్షిణ రాష్ట్రాలే ప్రధాన స్తంభాలని, వాటి అభివృద్ధి నీటిపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, ఆరోగ్యవంతమైన పౌరులు లేదా పర్యావరణం- ఇలా ఏ రంగమైనా సరే, ఈ ప్రాంతానికి నీరే ప్రాణాధారం అని ఆయన స్పష్టం చేశారు.

కేంద్ర జలశక్తి, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలు, అంతర్రాష్ట్ర మండలి, ఆయా రాష్ట్రాల భాగస్వామ్యంతో జరిగే సంయుక్త సమావేశాల ద్వారా పెండింగ్‌లో ఉన్న నీటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరాన్ని అమిత్‌షా స్పష్టంగా చెప్పారు. మాదకద్రవ్యాలు, పోషకాహార లోపం, ఎదుగుదల లోపంపై పోరాడాల్సిన ఆవశ్యకతను ఆయన వెల్లడించారు. అలాగే, ఆస్తులు, అప్పుల విభజనకు సంబంధించిన అంశాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంగీకరించాయని అధికారిక ప్రకటన తెలిపింది.

చెన్నై సమీపంలోని కోవలంలో గురువారం జరిగిన ‘సదరన్ జోనల్ కౌన్సిల్’ (దక్షిణ ప్రాంతీయ మండలి) 31వ సమావేశ చర్చలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశానికి తమిళనాడు సీఎం సీ జోసెఫ్ విజయ్, కేరళం సీఎం వీడీ సతీశన్, ఆంధ్రప్రదేశ్ సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే, కేరళం పరిశ్రమలు, సమాచార సాంకేతిక శాఖ మంత్రి పీకే కున్హాలికుట్టి, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో కావేరి, నీట్, నియోజకవర్గాల పునర్విభజన అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. ఈ ప్రాంతం ఆర్థిక సహకారానికి సమానంగా రాజకీయ ప్రాతినిథ్యం, ఆర్థిక సమానత్వం, మౌలిక సదుపా యాల మద్దతు, జాతీయ విధాన రూపకల్పనలో అధిక వాణిని కల్పించాలని దక్షిణాది ముఖ్యమంత్రులు ప్రతిపాదించారు. దక్షిణాది పార్లమెంటరీ బలాన్ని పరిరక్షించేందుకు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఒక అధికారిక తీర్మానాన్ని కోరారు.

ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ తర్వాత ఆ ప్రాంత రాజకీయ వాణికి ఎలాంటి భంగం వాటిల్లకుండా రక్షణ చర్యలు చేపట్టాలని తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ స్పష్టం చేశారు. నదీ జలాల నిర్వహణ, రవాణా, లాజిస్టిక్స్, తీరప్రాంత భద్రత, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విపత్తు ప్రతిస్పందన వంటి అంశాలపై దక్షిణ రాష్ట్రాల మధ్య మరింత సహకారం కోసం ముఖ్యమంత్రులు కోరారు.

దక్షిణ రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి ఒక రోడ్‌మ్యాప్ అవసరమని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య మరింత సహకారం, సమన్వయం ఉండాలన్నారు. ముల్లపెరియార్ ఆనకట్ట అంశాన్ని కేరళం ముఖ్యమంత్రి వీడీ సతీశన్ ప్రస్తావించారు. అలాగే ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, ప్రాంతీయ భద్రత వంటి రంగాలలో సహకార సమాఖ్య విధానం అవసరమన్నారు.

నియోజకవ ర్గాల పునర్విభజనకు 1971 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకోవాలని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ డిమాండ్ చేశారు. లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 543 స్థానాల సంఖ్యను రాబోయే 25 ఏళ్లపాటు కొనసాగించాలన్నారు. సీఎం విజయ్ రెండు ప్రధాన డిమాండ్లను లేవనెత్తారు. ఇందులో నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. మరోటి డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలను శిక్షించకుండా, శాసనాపరమైన హామీ ఇవ్వాలని కేంద్రానికి విన్నవించారు.