31 March, 2026 | 2:35 AM

అక్రమ గ్యాస్ నిల్వల గుట్టురట్టు

31-03-2026 01:11 AM

10 మంది అరెస్ట్, రూ.21 లక్షల సొత్తు స్వాధీనం

బంజారాహిల్స్, మార్చి 30 (విజయక్రాంతి): నగరంలో నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ ఉంచి, అధిక ధరలకు విక్రయిస్తున్న భారీ ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.  టాస్క్ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపిన వివరాల ప్రకారం బంజారాహిల్స్ పరిధిలోని నాగార్జున ఎక్స్ రోడ్ సమీపంలో గల ఒక స్మశాన వాటికను అడ్డాగా చేసుకుని ఈ అక్రమ దందా ను సాగిస్తున్నారు.

శంషాబాద్ కేంద్రంగా మెట్రో గ్యాస్ ఏజెన్సీ నిర్వహిస్తున్న ప్రధాన నిందితుడు మొహమ్మద్ అమీర్ నిబంధనలను అతిక్రమించి బంజారాహిల్స్ ప్రాంతం లో సిలిండర్లను అక్రమంగా డంపింగ్ చేస్తున్నాడు. తన సిబ్బంది సహాయంతో ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ధరకు వీటిని విక్రయిస్తున్నాడు. ఇన్స్పెక్టర్ యదేందర్, ఎస్‌ఐ రవిరాజ్ బృందం ఈ మెరుపు దాడి నిర్వహించింది. అరెస్టయిన వారిలో గ్యాస్ ఏజెన్సీ సిబ్బందితో పాటు, నిల్వకు స్థలాన్ని అద్దెకు ఇచ్చిన నల్ల పోచమ్మ దేవాలయ అధ్యక్షుడు రామ్ రాజ్ సింగ్ కూడా ఉన్నారు. 

గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు మొహమ్మద్ అమీర్తో పాటు డెలివరీ బాయ్స్, డ్రైవర్లు, స్థల యజమానితో కలిపి మొత్తం 10 మందిని పోలీ సులు అరెస్ట్ చేశారన్నారని వెల్లడించారు. ఈ ముఠా నుంచి సుమారు రూ.21,88,000 విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకోగా ఇందులో వివిధ పరిమాణాలకు చెందిన 414 గ్యాస్ సిలిండర్లు, రవాణాకు ఉపయోగిస్తున్న 10 వాహనాలు ఉన్నాయన్నారు.