నకిలీ పత్తి విత్తనాల అక్రమ రవాణా
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): నకిలీ విత్తనాలను అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి సుమారు రూ.4 లక్షల విలువైన 200 కిలోల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. విత్తనాల రవాణాకు ఉపయోగించిన కియా కారుతో పాటు మొబైల్ ఫోన్ను సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రాత్రి నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్నారన్న సమాచారంతో ఆదిలాబాద్ ఎక్స్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు.
అనుమానాస్పదంగా వచ్చిన కియా కారును (టీజీ19 బీ 1120) తనిఖీ చేయగా నాలుగు పాలిథిన్ బ్యాగుల్లో సుమారు రెండు క్వింటాళ్ల విత్తనాలు గుర్తించారు. కారులో ఉన్న భీమిని మండలం పెద్దపేటకు చెందిన షేక్ సల్మాన్ (29), సిరిసిల్ల జిల్లా మర్రిగడ్డకు చెందిన అరే వెంకటగోపాల్రెడ్డి (53)లను అదుపులోకి తీసుకున్నారు.నిందితులు కొంతకాలంగా నకిలీ విత్తనాలను వివిధ ప్రాంతాలకు తరలించి, అధిక దిగుబడి విత్తనాలుగా నమ్మించి రైతులకు విక్రయిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సి ఐ ఎన్.రవి తెలిపారు.
జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ వీరిపై నకిలీ విత్తనాల అక్రమ రవాణా, విక్రయానికి సంబంధించి కేసులు నమోదై ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్కు పంపినట్లు తెలిపారు.రైతులు లైసెన్స్ డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేసి తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని సి ఐ సూచించారు. నకిలీ విత్తనాల విక్రయం లేదా రవాణాపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు లేదా వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేయాలని కోరారు.






