12 April, 2026 | 3:57 PM

వ్యవసాయభూమిలో అక్రమ వెంచర్లు

17-10-2025 12:00 AM
  1. ప్రభుత్వ ఆదాయానికి గండి గుట్టు చప్పుడు కాకుండా 
  2. ప్లాట్ల అమ్మకం పట్టించుకోని రెవెన్యూ, జీపీ అధికారులు

చిట్యాల, అక్టోబర్ 16 (విజయక్రాంతి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవసాయ భూముల్లో అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్లను విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుట్టు చప్పుడు కాకుండా వెంచర్లలో రహదారులను ఏర్పాటు చేయకుండా అనధికారిక మ్యాపుతో  సామాన్య ప్రజలను మోసం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే మండలకేంద్రంలోని  సర్వే నంబర్ 52,1,55/ఎ లో ఒక ఎకరం వ్యవసాయ భూమిలో నాలా కన్వర్షన్, టౌన్ ప్లానింగ్ అనుమతులు లేకుండా అనధికారికంగా ప్లాట్లను విక్రయిస్తున్నారు. ఈ తతంగం మండల కేంద్రంలో జరుగుతున్నా అటు రెవెన్యూ, ఇటు జీపీ అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇంటి నిర్మాణానికి అనుమతి కావాలంటే సవా లక్ష రూల్స్ మాట్లాడే అధికారులు మరి ఈ అక్రమ వెంచర్లను ఎందుకు ‘మామూలు’గా తీసుకుంటున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

అక్రమ వెంచర్ విషయమై కొంతమంది అధికారులను వివరణ కోరితే మాకు ఏమి తెలియదు, మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. అయితే వాస్తవానికి రోజు రోజుకు ప్లాట్లు అక్రమ పట్టాలు చేయించుకుంటూ ప్రభుత్వ సొమ్ముకు భారీగా గండి పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం10, 20, గుంటలు, ఎకరాల చొప్పున భూమికి పట్టా చేయాలి కానీ రెండు, మూడు గుంటలు పట్టా చేస్తూ రెవెన్యూ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు.

అయితే కొంతకాలానికి ఇల్లు నిర్మాణం చేపట్టాలంటే గ్రామపంచాయతీ నుండి ఎలాంటి పర్మిషన్ రాదనే విషయాన్ని కప్పిపెట్టి అక్రమంగా ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా ప్లాట్లు అమ్మకాలను నిర్వహిస్తున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అక్రమంగా ప్లాట్ల అమ్మకాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చినప్పుడు పట్టాలు కాకుండా నాలా కన్వర్షన్ చేసుకునే విధంగా అధికారులు వారికి మోటివేట్ చేయాలని, లేని పక్షంలో రెండు గుంటలు మూడు గుంటలు పట్టాలు చేయడం వల్ల రానున్న రోజుల్లో కొనుగోలు చేసిన లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని, దీనిపై అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

అక్రమ వెంచర్లకు రిజిస్ట్రేషన్లు జరుగవు...

ప్రభుత్వ నిబంధన ప్రకారమే వెంచర్లు ఏర్పాటు చేయాలని, ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసి ల్దార్ ఇమామ్ బాబా షేక్ తెలిపారు. వ్యవసాయ భూ ములను వెంచర్లుగా మార్చి విక్రయిస్తునట్లు తమ దృష్టికి రాలేదన్నారు. వీటికి రిజిస్ట్రేషన్లు జరగవని, రానున్న రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పారు. నిబంధనలకు విరుద్ధగా వెలిసిన వెంచర్లపై తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటాన్నారు.

- ఇమామ్ బాబా షేక్, తాసీల్దార్