11 June, 2026 | 3:17 AM

గుడుంబా స్వాధీనం

11-06-2026 01:58 AM

ముగ్గురికి బైండోవర్

బెజ్జంకి, జూన్ 10: అక్రమ నాటుసారా తయారీ, విక్రయాలపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపింది. హుస్నాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల వడ్డెర కాలనీ, బేగంపేట గ్రామాల్లో బుధవారం నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో గణనీయమైన పరిమాణంలో గుడుంబా సామగ్రిని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు.

ఎక్సైజ్ ఎస్త్స్ర రూప ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో వడ్డెర కాలనీలో సంపంగి బాలమల్లు వద్ద 10 లీటర్ల గుడుంబా, 10 కిలోల బెల్లం, 2 కిలోల పటికను స్వాధీనం చేసుకున్నారు. బేగంపేట గ్రామంలో దున్నపోతుల లచ్చవ్వ వద్ద 1 లీటర్ నాటుసారను పట్టుకుని కేసు నమోదు చేశారు. అక్రమ మద్యం వ్యవహారాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను బెజ్జంకి తహసీల్దార్ ఎదుట హాజరుపర్చి బైండోవర్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని వారికి కఠిన హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా హుస్నాబాద్ ఎక్సైజ్ సీఐ పవన్ మాట్లాడుతూ, స్టేషన్ పరిధిలో నాటుసారా తయారీ, విక్రయాలను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తామని హెచ్చరించారు.ఈ దాడుల్లో హెడ్ కానిస్టేబుల్ కొండల్రావు, కానిస్టేబుళ్లు సంపత్, శైలజ తదితరులు పాల్గొన్నారు.