16 July, 2026 | 1:56 AM

నాటు సారా పట్టివేత...ఒకరి అరెస్ట్

16-07-2026 01:46 AM

మఠంపల్లి, జులై 15 :ద్విచక్ర వాహనంపై మూడు లీటర్ల నాటు సారాయిని తరలిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సంఘటన బుధవారం మఠంపల్లి మండలంలోని సాగర్ సిమెంట్ పరిశ్రమ సమీపాన చోటు చేసుకుంది. హుజూర్ నగర్ ఎక్సైజ్ ఎస్‌ఐ జగన్మోహన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మఠంపల్లి గ్రామపంచాయతీ పరిధి సాగర్ సిమెంట్ పరిశ్రమ సమీపాన ప్రధాన రహదారి వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా టీవీఎస్ ద్విచక్ర వాహనం పై ఒక వ్యక్తి రఘునాథ పాలెం గ్రామం వైపు వెళ్తున్నాడు.

అతన్ని ఆపి తనిఖీ చేయగా అతని వద్ద సుమారు మూడు లీటర్ల నాటు సారా దొరికింది.అతని వివరాలు మండలంలోని లాలి తండా గ్రామానికి చెందిన భానోత్ భగ్న అని తెలిసింది.లాలి తండాలో నాటు సారాను తయారు చేసి సమీప గ్రామాల్లో విక్రయించేందుకు వెళ్తున్నాడని తెలిపారు.అనంతరం లాలి తండాలో ఆ వ్యక్తికి చెందిన సారా తయారీకి వినియోగించే సుమారు 400 లీటర్ల బెల్లం పానకంను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశామని ఎస్‌ఐ మీడియాకు తెలిపారు.ఈ సందర్భంగా అతన్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.ఈ తనిఖీల్లో ఎస్‌ఐ వెంట ఎక్సైజ్ కానిస్టేబుల్స్ గురవయ్య,గోపి రెడ్డి,డ్రైవర్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.