దీర్ఘకాలిక దృష్టితో గోదాములు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి) : రాష్ట్రంలో వేర్‌హౌసింగ్ సామర్థ్యాన్ని భారీగా పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. వచ్చే రెండేళ్లలో అదనంగా మరో 5 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. బుధవారం సచివాలయంలో వేర్‌హౌసింగ్, హాకా కార్పొరేషన్లు, మార్క్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఆయా కార్పొరేషన్ల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, ఆర్థిక స్థితిగతులు, గోదాముల వినియోగం, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలు, ఆదాయ వృద్ధి అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ఆధీనంలో 52 సొంత గోదాములు ఉండగా, వాటి నిల్వ సామర్థ్యం సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఉందని తెలిపారు. ప్రస్తుతం ఈ గోదాముల్లో 104 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదై 6.33 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ ఉన్నాయన్నారు.
అదే విధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీలు, పీఈజీ, ఇన్వెస్టర్ గోదాములు, అద్దె గోదాములతో కలిపి మొత్తం 524 గోదాములను వినియోగిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 48 కొత్త గోదాములు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. మొదటి దశలో 17 గోదాములను 2027 జనవరి నాటికి పూర్తి చేసి 2.12 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. రెండో విడతలో 31 గోదాములను 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేసి 3.66 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యాన్ని కల్పించనున్నట్లు వివరించారు.
32 గోదాముల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని, వీటి ద్వారా అదనంగా 3.25 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. మొత్తంగా రాష్ట్రంలో సుమారు 15 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యాన్ని కల్పించేలా ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు.
కొత్తగా నిర్మించే ప్రతి గోదాముపై తప్పనిసరిగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గోదాముల అవసరాలకు విద్యుత్‌ను స్వయంగా ఉత్పత్తి చేసుకోవడంతో పాటు మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించి అదనపు ఆదాయం సమకూర్చుకునేందుకు రెడ్కో సంస్థతో చర్చించి కార్యాచరణ రూపొందించాలని సూచించారు.






