calender_icon.png 30 December, 2025 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాగున్నా ..రా!

30-12-2025 02:08:35 AM

వచ్చారు.. వెళ్లారు!

అసెంబ్లీలో కేసీఆర్ ఉన్నది ౩ నిమిషాలే

మాజీ సీఎం కేసీఆర్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల కరచాలనం

అసెంబ్లీలో మాజీ సీఎం కేసీఆర్‌తో సీఎం రేవంత్‌రెడ్డి కరచాలనం

  1. నేరుగా కేసీఆర్ సీటు వద్దకు వెళ్లి పలకరింపు
  2. మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్యేలు కూనంనేని, నవీన్ కూడా..
  3. శీతాకాల సమావేశాల్లో మొదటి రోజు ఆసక్తికర సన్నివేశం
  4. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేసీఆర్‌కు ఘన స్వాగతం
  5. సభలో మూడు నిమిషాలే ఉన్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్

హైదరాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): తెలంగాణ అసెంబ్లీలో శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో వాడీవేడీ చర్చ జరుగుతుందని అందరూ ఊహించారు. కానీ సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మిగతా సభ్యుల అందరి కంటే ముందుగానే వెళ్లి తన చైర్‌లో కూర్చోగా సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ హాల్లోకి రాగానే కేసీఆర్ దగ్గరికి వెళ్లి కరచాలనం చేసి పలకరించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి ముఖ్యమంత్రి వాకబు చేశారు. బాగున్నారా అని రేవంత్‌రెడ్డి అడుగగా.. బాగున్నానని కేసీఆర్ సమాధానం ఇచ్చారు. తర్వాత మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్‌లు బీర్ల అయిలయ్య, ఆది శ్రీనివాస్, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూడా కేసీఆర్ వద్దకు వచ్చి పలకరించారు.

ఈ సందర్భంగా ఇటీవల జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలుపొందిన నవీన్‌యాదవ్ కూడా కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే మంత్రి ఉత్తమ్ కరచాలనం చేసిన సందర్భంలో చేయి గట్టిగా నొక్కినట్టు అనిపించడంతో.. కోపంతో ఇస్తున్నారా? లేక ప్రేమతో ఇస్తున్నారా అని కేసీఆర్ నవ్వుతూ పలుకరించడం కనిపించింది. 

అసెంబ్లీలో కొద్దిసేపే..

శాసన సభా శీతాకాల సమావేశాల సందర్భంగా ఆదివారం ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి హైదరాబాద్ చేరుకున్న కేసీఆర్.. సోమవారం ఉదయం 9ః52 నిమిషాలకు నందినగర్‌లోని ఆయన నివాసం నుంచి అసెంబ్లీకి బయలుదేరారు. అసెంబ్లీకి వచ్చే క్రమంలో కేసీఆర్ వెంట మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి కూడా ఉన్నారు. ఉదయం 10ః32 నిమిషాలకు కేసీఆర్ అసెంబ్లీ ఆవరణంలోకి చేరుకున్నారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేసీఆర్‌కు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అనంతరం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్‌ను అసెంబ్లీ లోపలికి తీసుకెళ్లారు. కేసీఆర్ వచ్చిన కాసేపటికే శాసనసభ ప్రారంభమైంది. అయితే కేసీఆర్ మాత్రం అసెంబ్లీలో కేవలం మూడు నిమిషాల పాటే ఉన్నారు. సభ ప్రారంభమైన తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సం తాప తీర్మానాలను మొదలుపెట్టారు.

సంతాప తీర్మానాలు ముగిసిన వెంటనే మాజీ మంత్రి హరీశ్‌రావుతో కలిసి కేసీఆర్ బయటకు వచ్చారు. అసెంబ్లీ రిజిస్టర్‌లో సంతకం చేసిన వెంటనే శాసన సభ నుంచి నేరుగా నందినగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లిపోయారు. అయితే తొలిరోజు సమావేశాలకు కేసీఆర్ హాజరు కాగా తర్వాత రోజుల్లో సభకు హాజరవుతారా అని సందేహం వ్యక్తమవుతోంది.