calender_icon.png 1 January, 2026 | 6:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేజీబీవీ ఎస్‌ఓపై తక్షణ చర్యలు తీసుకోవాలి

01-01-2026 04:45:28 PM

కేజీబీవీ గురుకుల పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలి

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎస్‌ఓలను బదిలీ చేయాలి

డివైఎఫ్ఐ–కేవీపీఎస్ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి కి వినతి

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా ఉన్న కేజీబీవీ గురుకుల పాఠశాలల్లో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని డివైఎఫ్ఐ, కేవీపీఎస్ నాయకులు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కేజీబీవీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో ఎస్‌ఓలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తోందని విమర్శించారు. పాఠశాలల్లో విద్యార్థులకు సరైన మెనూ అమలు చేయకపోవడం, నాణ్యమైన పౌష్టికాహారం అందించకపోవడం వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురవుతూ ఆస్పత్రుల పాలవుతున్నారని తెలిపారు. కొంతమంది విద్యార్థులు జ్వరాలు వంటి వ్యాధులతో తీవ్రంగా బాధపడుతున్నారని పేర్కొన్నారు.

ప్రత్యేకంగా వాంకిడి మండలంలోని కేజీబీవీ పాఠశాలలో ఎస్‌ఓ విద్యార్థుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తూ, మానసికంగా మాటల ద్వారా వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో గత నెలలో బాధిత విద్యార్థులు తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించి, సంబంధిత ఎస్‌ఓను తొలగించాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. ఆ ఎస్‌ఓ దురుసుగా ప్రవర్తిస్తూ, విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అందుకే ఆయనపై తక్షణ చర్యలు తీసుకుని బదిలీ చేయాలని డివైఎఫ్ఐ, కేవీపీఎస్ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, కేవీపీఎస్ జిల్లా నాయకులు వడ్లూరి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.