14 July, 2026 | 4:50 AM

వర్షాభావం బుగులు

14-07-2026 12:00 AM

భారతదేశంపై ఎల్ నినో ప్రభావం తీవ్రంగా కనిపిస్తున్నది. నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించి నెల రోజులు దాటినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదవుతుండటంతో కరువు భయాలు వెంటాడుతున్నాయి.

ఈ తరుణంలో వాతావరణ శాఖ హెచ్చరికలు ప్రజలను, ముఖ్యంగా రైతులను మరింతగా కలవరపెడుతున్నాయి. మరో నాలుగైదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని, ఆ తర్వాత అక్కడక్కడ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో రైతాంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నది. కాగా, ప్రస్తుతం దేశంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్ సహా ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం విదితమే.

అదే సమయంలో దక్షిణాదిలో ఎండలు దంచికొడుతున్నాయి. ఒకవైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టి పరిస్థితులు నెలకొనడం ఎల్ నినో ప్రభావానికి ప్రత్యక్ష తార్కాణమని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వానలు ముఖం చాటేయడంతో దేశంలో ఎవుసం కుంటుపడింది. వరుణుడు కరుణిస్తాడేమోనన్న ఆశతో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో రైతులు దుక్కులు దున్ని, విత్తులు కూడా నాటారు. కానీ, చినుకైనా రాలకపోవడంతో పుడమిని చీల్చలేక విత్తనం చతికిలపడుతున్నది.

అక్కడక్కడ మొలకెత్తినవి ఎండలకు తాళలేక సొమ్మసిల్లిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో మొలకెత్తిన విత్తులను కాపాడుకోలేక, మళ్లీ విత్తనాలు నాటేందుకు ఆర్థిక భారం మోయలేక అన్నదాతలు ఆగమాగమవుతున్నారు. ఈ నేపథ్యంలో పంటల సాగు ఆలస్యమై వానాకాలం వ్యవసాయ ప్రణాళికలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా వరి, పత్తి, పప్పుధాన్యాల సాగుపై ప్రభావం ఎక్కువగా ఉన్నది. సాగునీటి వనరులు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో పరిస్థితి మరింత దయనీయంగా కనిపిస్తున్నది.

పెద్ద జలాశయాల నుంచి చిన్న చిన్న చెరువులు, కుంటల వరకు అన్ని అడుగంటి, భూగర్భ జలాలు పడిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ తాగునీటి సమస్య తలెత్తుతున్నది. కరువు రక్కసి తరుముకొస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టి, నీటి సంరక్షణ చర్యలను చేపట్టి ఈ ఆపత్కాలాన్ని ఎదుర్కోవాలి.