బకాయిలకు వడ్డీ చెల్లించండి!
పెన్షన్ ప్రభుత్వాలు ఇచ్చే భిక్ష కాదు-, అది ఉద్యోగుల హక్కు అని సుప్రీంకోర్టు 17 డిసెంబర్ 1982న డి.ఎస్. నకార తీర్పులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వైవీ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఆ తీర్పు ప్రకారం మార్చి 2024 నుంచి ఇప్పటివరకు రిటైర్డ్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు హక్కుగా చెల్లించాల్సిన రిటైర్మెంట్ బకాయిలు రెండు సంవత్సరాలైనా ప్రభుత్వం చెల్లించడం లేదు.
దీంతో కొంత మంది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ప్రారంభంలో కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం చెల్లించింది. కానీ తర్వాత తీర్పు వచ్చిన వెంటనే చెల్లించకపోవడంతో కాంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కింద కేసులు వేసిన సందర్భంలో హైకోర్టు రిటైర్మెంట్ బకాయిలు 10% వడ్డీతో సహా వెంటనే చెల్లించాలని ఆదేశించింది. అయినప్పటికీ కొంతమందికి మాత్రమే పూర్తిస్థాయిలో చెల్లించారు. మరి కొంతమందికి కొన్ని బిల్లులు మాత్రమే పాక్షికంగా చెల్లించి, పూర్తిగా చెల్లించామని కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారు.
ఈ విధంగా కోర్టు ఆదేశాలను కూడా ప్రభుత్వం లెక్కచేయడం లేదు. కొంతమంది వ్యక్తిగత ప్రయత్నాల ద్వారా, పైరవీల ద్వారా తెచ్చుకుంటున్నారు. రిటైర్మెంట్ బకాయిలను హైకోర్టు ఆదేశాల మేరకు 10 శాతం వడ్డీ కూడా చెల్లించాలి. కానీ వడ్డీ చెల్లించలేదు. అదేవిధంగా కోర్టుకు రాని వారికి కూడా రిటైర్మెంట్ అయిన నెల ఆధారంగా వరుస క్రమంలో దశలవారీగా కాకుండా, ఈ జూలై నెలలో బిల్లులన్నింటినీ ఏకమొత్తంలో ఇప్పటివరకు రిటైర్డ్ అయిన పెన్షనర్లందరికీ చెల్లించాలి. ఉద్యోగ, ఉపాధ్యాయులు సర్వీస్‌లో ఉన్నప్పుడు కొంతమంది హోమ్ లోన్, పర్సనల్ లోన్, టాప్ అప్ , ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు తీసుకున్నారు.
అలాంటివారు వేల సంఖ్యలో ఉన్నారు. వారు బ్యాంకులకు హోమ్ లోన్‌కు 9 శాతం నుంచి 13 శాతం వరకు వడ్డీ, పర్సనల్ లోన్‌కు, ప్రైవేటు వ్యక్తుల వద్ద నూటికి రెండు శాతం వడ్డీ చొప్పున వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. కాబట్టి హైకోర్టు ఆదేశాల మేరకు తప్పనిసరిగా ప్రభుత్వం 10 శాతం వడ్డీ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. మార్చి 2024 నుంచి జూన్ 2026 వరకు దాదాపు 26,000 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు రిటైర్ అయ్యారు.
అయితే, ఎనిమిది నెలలుగా వివిధ పెన్షనర్ సంఘాలు ఉద్యమాలు చేస్తే వంద రోజులలో రూ.6 వేల కోట్లు చెల్లిస్తామని, వాటిలో మే నెలలో రూ. 2000 కోట్లు, జూన్ నెలలో రూ.2000 కోట్లు, సెప్టెంబర్ 2025 వరకు కమ్యుటేషన్, జీపీఎఫ్ 100 శాతం చెల్లించామని పాలకులు ప్రకటించారు. కానీ, సెప్టెంబర్ 2025 వరకు ఎస్‌టీవోలో కమ్యుటేషన్ బిల్లు జతచేసినప్పటికీ కొంతమందికి రాలేదు. అదే విధంగా కొంతమందికి జీపీఎఫ్ కూడా రాలేదు. ఇది వాస్తవం. కొంతమంది బిడ్డల పెళ్లిళ్లు ఉన్నాయని పెండ్లి కార్డు లు పెట్టినప్పటికీ వారికి జీపీఎఫ్ డబ్బులు అందలేదు. ఇది చాలా దారుణం.
కాబట్టి టోకెన్ నెంబర్లు పరిశీలించి, వారికి ఈ జూలై నెలలో చెల్లించాలని రిటైర్డ్ ఎంప్లాయిస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రిటైర్డ్ అయిన ఉద్యోగులందరికీ రిటైర్మెంట్ బకాయిలన్నింటిని దశలవారీగా కాకుం డా ఏక మొత్తంగా ఈ జూలై నెలలో చెల్లించాలి. అంతేకాదు, హైకోర్టు ఆదేశాల మేరకు బకాయి లు చెల్లించినవారికి 10% వడ్డీ కూడా చెల్లించాలని వేలాది పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు.
వ్యాసకర్త: రిటైర్డ్ ఎంప్లాయిస్
అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్
అధ్యక్షుడు, 9949937745
***
కందుకూరి
దేవదాసు






