జస్టిస్ శేఖర్‌యాదవ్‌పై అభిశంసన తీర్మానం!
* రాజ్యసభలో నోటీసు ఇచ్చిన విపక్షాలు
లక్నో, డిసెంబర్ 13: ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ)పై మాట్లాడిన అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ శేఖర్ యాదవ్‌పై ప్రతిపక్షాలు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. సమాజ్‌వాదీ ఎంపీ కపిల్ సిబల్ నేతృత్వంలోని సభ్యులు ఈ మేరకు రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌కు నోటీసును అందించారు. ఈ నోటీసుపై దాదాపు 55 మంది సభ్యులు సంతకం చేసినట్లు తెలిసింది. ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసేలోపు ఈ తీర్మానం చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఈ నెల 8న ప్రయాగ్‌రాజ్‌లో విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ శేఖర్ మాట్లాడుతూ ఉమ్మడి పౌరస్మృతి అంశంలో మెజారిటీ ప్రజల అబీష్టం మేరకే చట్టం నడుచుకోవాలంటూ పేర్కొన్నారు. కుటుంబపరంగా, సమాజ పరంగా చూసినా మెజారిటీ ప్రజల సంక్షేమం, సంతోషమే ముఖ్యమని అన్నారు. బహుభార్యత్వం, ట్రిపుల్ తలాఖ్, హలాల్ వంటి విధానాలు ఆమోదయోగ్యం కావని వ్యాఖ్యానించారు.
దేశంలోని పౌరులందరినీ సమానంగా చూడాలన్నదే యూసీసీ లక్ష్యమని పేర్కొన్నారు. దీంతో జస్టిస్ శేఖర్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డాయి. ఆయనను పదవి నుంచి తప్పించేందుకు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. కాగా జస్టిస్ శేఖర్ 2021లో గోవధ కేసు విచారిస్తున్నప్పుడు కూడా విమర్శలు ఎదుర్కొన్నారు.






