16 July, 2026 | 10:02 AM

హిందుస్థాన్‌లో మెజార్టీ ప్రజలదే చట్టం

10-12-2024 12:35 AM

* జస్టిస్ శేఖర్‌కుమార్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు

లక్నో, డిసెంబర్ 9: మెజార్టీ ప్రజల ఆకాంక్షల మేరకు హిందూస్థాన్‌లో చట్టం పనిచేస్తుందని, ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించేందుకు తనకు ఎలాంటి సంకోచం లేదని అలహాబాద్ జస్టిస్ శేఖర్‌కుమార్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఆదివారం విశ్వహిందూ పరిషత్ యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)పై నిర్వహించిన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మతం, కులం, లింగభేదాలతో సంబంధం లేకుండా ప్రామాణిక గుర్తింపు తీసుకువచ్చేందుకు యూనిఫాం సివిల్ కోడ్ అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

బహు భార్యుత్వం,ట్రిపల్ తలాక్, హలాల్ సంప్రదాయాలు భారత్‌లో ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, ముస్లింల ప్రస్తావన లేకుండా వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతమైన చట్టాలకు భారత్‌లో తావు లేదన్నారు. ‘మేం పుట్టినప్పటి నుంచి పిల్లలకు తాము సహనం, దయాగుణం నేర్పుతాం. కానీ.. మీరు వారి ముందే జీవాలను వధిస్తారు. జీవాల వధ ద్వారా పిల్లలు ఏం నేర్చుకుంటారు?’ అని ప్రశ్నించారు. హిందూమతంలో బాల్యవివాహాలు, సతీసహగమనం వంటి దురాచారాలు ఉండేవని తాను ఒప్పుకొంటానని, కానీ.. అలాంటి దురాచారాలను రాజారామ్మోహన్‌రాయ్ వంటి సంస్కర్తలు వ్యతిరేకించారని గుర్తుచేశారు. హిందూశాస్త్రాల్లో మహిళలు దేవతలుగా పూజలందుకుంటారని, కానీ, ఒక్క ట్రిపుల్ తలాక్‌తో వారు భరణం అందుకునేందుకు అర్హులు కాకుండాపోవద్దన్నారు.