అప్పు తీర్చాలంటే.. బ్లేడుతో దాడి యువకుడికి గాయాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 14 (విజయక్రాంతి): అప్పు తిరిగి చెల్లించమని అడిగినందుకు బ్లేడుతో దాడికి పాల్పడిన ఘటన ఎస్‌ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సనత్‌నగర్‌లోని అశోక్ కాలనీకి చెందిన మహ్మద్ అహ్మద్‌ఖాన్ ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి 12 గంటల సమయంలో తన స్నేహితులైన ఖలీమ్, సయ్యద్, జాహిద్‌తో కలిసి అమీర్‌పేట ప్రాంతానికి టీ తాగేందుకు వెళ్లి, తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో బీకేగూడ వద్ద కూరగాయల మార్కెట్‌లో నిమ్మకాయల వ్యాపారం చేసే అమీన్(38)ను కలిశారు.
అహ్మద్ ఖాన్ మిత్రుడైన ఖలీమ్ వద్ద గతంలో అమీన్ రూ.5 వేలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు తిరిగి ఎప్పుడు చెల్లిస్తావని అడగడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అనంతరం అహ్మద్ ఖాన్, ఖలీమ్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కోపంతో అమీన్ పక్కనే ఉన్న బ్లేడ్‌తో అహ్మద్‌ఖాన్‌పై దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర రక్తస్రావమైన అహ్మద్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.






