28-04-2025 12:00:00 AM
నీడల చెట్లకింద పక్షుల పాటనీ,
ఆపై తుమ్మెదల ఝంకారాన్నీ
ఆలకించడం కోసం-
నిశ్శబ్దంలో కూర్చోవడానికి
ఇష్టపడుతుంటాను నేను!
పరి-భ్రమణాల మేఘాలను పరీక్షించడానికి,
ఒక పుస్తకాన్ని చదవడానికి లేదా
ఒక పాట పాడడానికీ,
అడవి పక్షి కూత వినడం కోసం-
నిశ్శబ్దంలో కూర్చోవడానికి
ఇష్టపడుతుంటాను నేను!
దైనం-దిన పనిని దాదాపుగ ముగించేసేసి వెళ్ళినప్పుడు-
దూరపుకొండ ప్రక్కన
సూర్యుడి మెరుపు చిత్రాన్ని చూడడం కోసం-
నిశ్శబ్దంలో కూర్చోవడానికి
ఇష్టపడుతుంటాను నేను!
సాయం సంధ్యాకాంతిలో
తన శక్తినంతా కూడదీసుకుని
‘విప్‌పూర్‌విల్’ పక్షి
పాడుతున్న పాటని వినడం కోసం
నిశ్శబ్దంలో కూర్చోవడానికి
ఇష్టపడుతుంటాను నేను!
తారలు తళతళా ప్రకాశించే ఆకాశం కింద
సర్వవేళలా ప్రశాంత నిశ్శబ్దంగా జీవించడానికి
విశ్వమంతటినీ మనఃపూర్వకంగా
ప్రార్థించడం కోసం-
నిశ్శబ్దంలో కూర్చోవడానికి
ఇష్టపడుతుంటాను నేను!
(‘విప్‌పూర్‌విల్’ ఉత్తర అమెరికాలో తరచూ తారస పడే రాత్రిపూట పాడే పక్షి.) అనువాదకవిత
ఆంగ్లమూలం: ఆల్విన్ లెగ్జాండర్
తెలుగు సేత: ‘రఘువర్మ’