02-05-2025 04:49:07 PM
అమరావతి,(విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ లోని వెలగపూడి వేదికగా అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాన్ని(Amaravati Reconstruction Program) ఏపీ ప్రభుత్వం(AP Government) నిర్వహిస్తుంది.ఈ వేడకకు హాజరయ్యేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... గత ప్రభుత్వ హయంలో అమరావతి రైతులు ఐదేళ్లుగా నలిగిపోయారని, లాఠీ దెబ్బలు తిన్నారని పేర్కొన్నారు. మా కన్నీళ్లు తుడిచేవారెవరని అప్పట్లో రైతులు తనన్ను అడిగారని, అమరావతి అనేది ఐదు కోట్ల మందికి సంబంధించిన హబ్ అని అన్నారు.
దేశమే తన కుటుంబంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃప్రారంభానికి విచ్చేసిన ప్రధాని మోదీకి చేతులెత్తి నమస్కారిస్తున్నానని పవన్ చెప్పారు. దివిసీమ తుపానులా గత ప్రభుత్వం అమరావతి తుడిచేసిందని, ధర్మయుద్ధంలో అమరావతి రైతులు విజయం సాధించారని పేర్కొన్నారు. రాజధాని రైతుల పోరాటానికి శిరస్సు వంచి పవన్ కళ్యాణ్ నమస్కరించారు. అమరావతి రైతుల త్యాగాలను మరచిపోలేమని, వారికి జవాబుదారిగా ఉంటామని, అందుకు ప్రతిగా రాజధాని నిర్మించి అమరావతి రైతుల రుణం తీర్చుకుంటామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
రైతులు భూములే ఇవ్వలేదు.. రాష్ట్రానికి భవిష్యత్తునిచ్చారని, అమరావతి ప్రపంచస్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా అవిర్భవిస్తుందని పవన్ వివరించారు. కేంద్రం, రాష్ట్రంలో ఏన్డీయే ప్రభుత్వాలే ఉండటం వల్ల శరవేగంగా అభివృద్ధి చేస్తామని, భవిష్యత్తులో మన విద్యార్థులు బెంగళూరు, హైదరాబాద్ వలస వెళ్లరన్నారు. అందరం కోరుకున్నట్లే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని, చంద్రబాబు దక్షతతో అమరావతి అద్భుత రాజధానిగా తీర్చిదిద్దుతారని పవన్ కళ్యాణ్ తెలిపారు. అమరావతి రాష్ట్రానికే కాదు.. దేశానికే తలమానికంగా నిలుస్తుందని, అందుకు కేంద్రం నుంచి సహకరిస్తున్న మోదీకి మరోసారి ధన్యవాదాలు తెలియజేశారు. భవానీ మాత మోదీని మరింత శక్తివంతుణ్ని చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కోరుకున్నారు.