calender_icon.png 2 May, 2025 | 6:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాదేశం -నాప్రజలు

28-04-2025 12:00:00 AM

ఒక్క తెలుగులోనే కాదు, ఆంగ్లంలో నూ అద్భుత కవితాత్మక ప్రయోగాలతో యావత్ మానవాళికే మార్గ నిర్దేశనం చేసిన గొప్ప వచన కవితా కావ్యం ‘నాదేశం నాప్రజలు’. మనిషి జీవితానికి యాభై ఏళ్ళ కాలం నిజానికి తక్కువేమీ కాదు. ఒక పుస్తకం ఎన్నేళ్లు బతికిందన్నది ‘అది ఏమిచ్చింది’ అన్న దానిపైనే ఆధారపడి వుంటుంది. కాల ప్రవాహం కారణంగా చాలా గ్రంథాలలో వస్తువులు పాతబడి పోవచ్చు.

కానీ, దర్శించే హృదయాలకు వాటిలోని ఆత్మలు ఎప్పుడూ సజీవమే. మహాకవి గుంటూరు శేషేంద్రశర్మ ‘నాదేశం నాప్రజలు(స్వర్ణోత్సవాని (1975 2025)కి చేరిన వేళ.. అందులోని ఇతివృత్తం నేటికీ ఎంతవరకు సందర్భోచితం అన్నది గమనిస్తే, ‘ఆ భావజాలం నిత్య నూతనమని’ అందరం అంగీకరిస్తాం. శేషేంద్ర వారి ఈ కావ్యానికే కాదు, ఆయన రాసిన ఏకైక తొలి సినీగీత (‘నిదురించే తోటలోకి..’: ‘ముత్యాలముగ్గు’ సినిమా) రచనకూ ఈ ఏడాదితో యాభై ఏళ్ళు పూర్తవుతున్నాయి.

తెలుగు, భారతీయ సాహితీ వనంలోకి నిజంగానే ఒక మృదుమధుర గీతం వలె వచ్చి ప్రవాహమై, సముద్రమై, సమస్త మానవాళి హృదయ నినాదమై నిశ్శబ్దంగా జీవి తాన్ని ముగించిన మహోన్నత అక్షర కిరణం శేషేంద్ర (1927 ఆయన ప్రతీ రచ నా ఒక్కో విలక్షణ అభ్యుదయ భావ తరం గం. తెలుగుతోపాటు అటు ఆంగ్లంలో, ఇటు సంస్కృతంలో అపార భాషా పాండిత్యాన్ని, అనూహ్య సృజనను సొంతం చేసుకున్న అసమాన ప్రతిభావంతుడు ఆయన.

ఆధునిక కవిత్వంలో విలక్షణ (వాస్తవిక) కాల్పను కుడు. ఆయన రచనలు విశ్వజనీనం. తాను ఎంత భావుకుడో అంత దార్శనికుడు. ఎంత ఆధునికమో అంత సనాతనం. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ఆధునిక సాహిత్యంపై తనదైన ముద్ర వేసిన గుంటూరు శేషేంద్ర శర్మ 30కి పైగా రచనలు చేశారు. ఆయన రచనలు అంతర్జాతీయ ఖ్యాతి గాంచాయి. ‘నాదేశం-నాప్రజలు’ 2004లోనే నోబెల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ అయ్యిం ది కూడా.

‘నాదేశం నాప్రజలు’ అన్న శీర్షికతోనే రచయిత ఎవరి కోసం, ఏం చెప్పబోతున్నారో స్పష్టమవుతున్నది. ఇంగ్లీషును మన దేశానికి ఆధునిక సంస్కృతంగా అభివర్ణించిన శేషేంద్రులు ఈ కావ్యాన్ని ఆ భాషలోకి (‘మైకంట్రీ మైపీపుల్’) కూడా తానే అనువదించడం విశేషం. దీనిని ఆధునిక ఇతిహాసం అని ఎం దుకన్నారో (ముందుమాట) తెలిస్తే అందరం అంగీకరించి తీరుతాం.

ఒక సగటు రైతు జీవ న స్థితిని, సామాన్యుని శ్రమైక పోరాటాన్ని, ప్రత్యేకించి భారతీయుల ఆత్మస్వరూపాన్ని మొత్తంగా మానవేతిహాసంగా ఆయన మలచి, కవిత్వీకరించిన తీరుకు మనం ముగ్ధులమవుతాం. అన్ని తరాల వారికీ, అన్నివేళలా మార్గనిర్దేశనం చేసిన ఈ కావ్యం సదరు లక్ష్యం నెరవేరే వరకూ ఇది సందర్భోచితమే అనడంలో సందేహమే లేదు.