26-09-2025 10:40:53 AM
హైదరాబాద్: హైదరాబాద్(Hyderabad)లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం(Rain) కురుస్తోంది. కూకట్ పల్లి, జేఎన్టీయూ, నిజాంపేట్, హైదర్ నగర్, మూషీరాబాద్, చిక్కడపల్లి, రామ్ నగర్, విద్యానగర్, దోమలగూడ, కవాడీగూడ, అంబర్ పేట్, కాచిగూడ,బర్కత్ పురా, బాగ్ లింగంపల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, ఫిలింనగర్, షేక్ పేట్, మణికొండ, రాయదుర్గం, హైటేక్ సిటీ,కోఠి,ఉప్పల్ తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఎకధాటిగా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఉద్యోగులకు ఇవాళ వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ఐటీ కంపెనీలకు సూచించారు. గురువారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని పోలీసులు కంపెనీలను కోరారు. అటు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. వర్షం ధాటికి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వికారాబాద్ జిల్లాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.