26-09-2025 09:09:52 AM
హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షాలు(heavy rains) కురుస్తున్నారు. హైదరాబాద్ లో గురువారం రాత్రి నుంచి మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు(Cyberabad Police) కీలక సూచనలు చేశారు. జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) గజారావు భూపాల్ జారీ చేసిన ఈ అడ్వైజరీ జారీ చేశారు. తుఫాను గరిష్ట ప్రభావంతో పాటు, పగటిపూట ఇలాంటి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించారు.
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎల్లో, ఆరెంజ్ హెచ్చరిక జారీ చేయబడింది. ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడానికి, ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, అత్యవసర సేవలను సజావుగా అందించడానికి ఇంటి నుండి పని చేసే అవకాశం కల్పించాలని అధికారులు సంస్థలకు సూచించారు. సైబరాబాద్ ఐటీ కారిడార్‌లోని కంపెనీలు సహకరించాలని కోరారు. ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని, విపత్తు ప్రతిస్పందన దళం (Disaster Response Force) బృందాలు సిద్ధంగా ఉన్నాయని పోలీసులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ఎక్కువ వరద నీరు చేరడంతో వాహనాలు నెమ్మదిగా కదలడం, ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు తమ ప్రయాణాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని కోరారు.