మధ్య మానేరులో పెరిగిన నిల్వ
- 22.06 టీఎంసీలకు చేరిన నీళ్లు
- ఎల్‌ఎండీకి 6 గేట్ల ద్వారా నీటి విడుదల
బోయినపల్లి, ఆగస్టు 10 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ మధ్య మానేరు (ఎస్‌ఆర్‌ఆర్) జలాశయంలోకి 22.06 టీఎంసీల నీటి నిల్వకు చేరుకున్నది. జలాశయం సామర్థ్యానికి 27.55 టీఎంసీల గాను సోమవారం సాయంత్రం వరకు 22.06టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు జలాశయం ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ఈ జలాశయంలో జూలై నెలలో నీరు లేక వెల వెల పోయింది.
ఆగస్టు మొదటి వారంలో వర్షాలు పడగా, అదేవిధంగా ఎల్లంపల్లి జలాశయం నుంచి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ కు జలాలు రాగా అక్కడి నుంచి వరద కాలువ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలం మాన్వాడ జలాశయంకు గత కొద్దిరోజులుగా నిరంతరం వరద కొనసాగుతుండడంతో జలాశయం నిండికుండలా మారింది. రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ నుంచి 13,183క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, జలాశయం నుంచి ఆరు గేట్ల ద్వారా దిగువన ఉన్న కరీంనగర్ జిల్లా ఎల్‌ఎండి జలాశయానికి 10,127 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతుంది. మాన్వాడ జలాశయానికి వరద కాలువ ద్వారా వరద నీరు వస్తుండపై రైతుల్లో ఆనందం నెలకొన్నది.






