ఎన్నారై డిపాజిట్లు బలమా.. భారమా?
ఇప్పటికే సుమారు 672 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే అత్యధిక విదేశీ మారక నిల్వలు కలిగిన దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఇంత భారీ నిల్వలు ఉన్నప్పటికీ రిజర్వ్ బ్యాంక్ అకస్మాత్తుగా విదేశాల్లో నివసిస్తున్న భారతీయులను తమ డాలర్లను భారత బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సిందిగా కోరుతోంది.
విదేశీ డాలర్లను భారత బ్యాంకు ల్లో డిపాజిట్ చేయడాన్ని సాధారణంగా ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ (బ్యాంక్) డిపాజిట్లు లేదా ఎఫ్‌సీఎన్‌ఆర్ (బి) డిపాజిట్లు అంటారు. అంతేకాదు బ్యాంకులు గ తంలో ఎన్నడూ లేనంతగా డాలర్ డిపాజిట్లపై అధిక వడ్డీని ప్రకటిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ స్వయంగా బ్యాంకుల కరెన్సీ హె డ్జింగ్ వ్యయాన్ని కూడా భరిస్తోంది. హెడ్జిం గ్ అంటే భవిష్యత్తులో డాలర్ ధర పెరిగినా లేదా తగ్గినా నష్టం రాకుండా ముం దుగానే భద్రత కల్పించుకోవడం.
ఇప్పటికే వందల బిలియన్ డాలర్ల విదే శీ మారక నిల్వలు ఉన్న దేశానికి మళ్లీ డాలర్లు ఎందుకు అవసరమయ్యాయి? అనే ఒక కీలకమైన ప్రశ్నను ఈ పరిణా మం లేవనెత్తుతోంది. దీనికి సమాధానం తెలుసుకోవాలంటే విదేశీ మారక నిల్వల పరిమాణం కంటే వాటి నాణ్యతను అర్థం చేసుకోవాలి. ఎఫ్‌సీఎన్‌ఆర్ (బి) డిపాజిట్లు బ్యాంకు డిపాజిట్లు మాత్రమే కావు. ఇవి భారత విదేశీ మారక నిర్వహణలో ఒక ప్రత్యేక ఆర్థిక సాధనం. ఎన్నారైలు తమ డాలర్లను భారత బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు. మెచ్యూరిటీ సమయంలో కూడా వాటిని డాలర్లుగానే తిరిగి పొందుతారు. రూపాయి విలువ ఎంత పడిపోయినా వారికి నష్టం ఉండదు. ఆ ప్రమాదాన్ని బ్యాంకులు, అంతిమంగా రిజర్వ్ బ్యాంక్ నిర్వహిస్తాయి.
ఇక్కడ ఒక ప్రాథమిక ఆర్థిక సూత్రాన్ని గుర్తుంచుకోవాలి. విదేశీ మారక నిల్వలు పెరగడం, దేశ సంపద పెరగడం రెండూ ఒకటే కావు. ఒక కుటుంబం బ్యాంకు నుం చి పెద్ద మొత్తంలో రుణం తీసుకుంటే చేతిలో నగదు పెరుగుతుంది. కానీ, ఆ కు టుంబం నిజంగా ధనవంతమైందని చెప్ప లేం. ఎందుకంటే ఆ డబ్బును తిరిగి చెల్లించాల్సిందే. విదేశీ కరెన్సీ డిపాజిట్ల పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంటుంది. ఇవి భారత బ్యాంకులకు వచ్చిన నిధులే అయినప్పటికీ, భవిష్యత్తులో అసలుతో పాటు వడ్డీతో కలిపి తిరిగి చెల్లించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది.
చాలామంది విదేశీ మారక నిల్వలను దేశం దగ్గర ఉన్న డబ్బుగా మాత్రమే చూస్తారు. కానీ, ఆర్థిక శాస్త్రంలో నిల్వల నా ణ్యతను పరిశీలిస్తారు. ఆ నిల్వల్లో ఎంత భాగం ఎగుమతుల ద్వారా వచ్చింది? ఎం త విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా వచ్చింది? ఎంత విదేశీ పోర్ట్‌ఫోలియో పె ట్టుబడుల ద్వారా వచ్చింది? ఎంత స్వల్పకాలిక విదేశీ రుణాలు, ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్ల రూపంలో వచ్చింది? అనే ప్రశ్నలకు సమాధానాలు కీలకమైనవి. ఎందుకంటే స్థిరమై న ఆదాయంతో వచ్చిన డాలర్లు, రేపు వెనక్కి వెళ్లిపోయే డాలర్లు ఒకేలా ఉండవు.
రిజర్వ్ బ్యాంక్ ఈ చర్య వెనుక మరో వాస్తవం కూడా ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అనిశ్చితిలో ఉంది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, చమురు ధరల హెచ్చు తగ్గులు, అమెరికా వడ్డీ రేట్ల ప్రభావం, డాలర్ బలపడటం వంటి పరిణామాలు అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో ముందస్తు జాగ్రత్తగా విదేశీ కరెన్సీ ప్రవాహాన్ని పెంచుకోవాలని ఆర్బీఐ భావిస్తోం ది. ఇది కొత్త ఆలోచనేమీ కాదు. 1991లో బంగారాన్ని విదేశాలకు తాకట్టు పెట్టి విదేశీ మారక ద్రవ్యాన్ని సమీకరించాల్సి వచ్చిం ది. ఆ సంక్షోభం తర్వాతే విదేశీ మారక నిల్వలను పెంచుకోవడం భారత ఆర్థిక విధానంలో ప్రధాన లక్ష్యంగా మారింది.
2013లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధాన మార్పు కారణంగా రూపాయి తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు కూడా రిజర్వ్ బ్యాంక్ ఇదే వ్యూహాన్ని అమలు చేసింది. అప్పట్లో ప్రత్యేక ఎఫ్‌సీఎన్‌ఆర్ పథకం ద్వారా దాదాపు 34 బిలియన్ డాలర్ల విదేశీ డిపాజిట్లను సమీకరించి రూపాయిని స్థిరపరిచింది.
దేశానికి వీటి వల్ల ప్రయోజనాలు మా త్రం గణనీయంగానే ఉంటాయి. రూపా యి విలువపై ఒత్తిడి తగ్గుతుంది. విదేశీ పెట్టుబడిదారులు అకస్మాత్తుగా పెట్టుబడులు వెనక్కి తీసుకున్నా మార్కెట్లో డాలర్ల కొరత ఏర్పడదు. చమురు, ఎరువులు, ఎలక్ట్రానిక్ పరికరాల వంటి కీలక దిగుమతులకు అవసరమైన విదేశీ కరెన్సీ లభ్యత మెరుగుపడుతుంది. అంతర్జాతీయ రేటింగ్ సంస్థల దృష్టిలో కూడా దేశ విదేశీ చెల్లింపు సామర్థ్యంపై విశ్వాసం పెరుగుతుంది. అ యితే దీని వెనుక కనిపించని ఖర్చు కూడా ఉంది. ఈసారి రిజర్వ్ బ్యాంక్ బ్యాంకుల కరెన్సీ హెడ్జింగ్ వ్యయాన్ని కూడా భరిస్తోం ది. అలాగే సీఆర్‌ఆర్, ఎస్‌ఎల్‌ఆర్ నిబంధనల్లో సడలింపులు ఇచ్చింది. అంటే ఈ డిపాజిట్లను ఆకర్షించడానికి కేంద్ర బ్యాంకే ఒక విధంగా సబ్సిడీ ఇస్తోంది. ఈ ఖర్చు చివరికి ఆర్థిక వ్యవస్థపైనే పడుతుంది.
మరో సవాలు కరెన్సీ మిస్‌మ్యాచ్. బ్యాంకులు డాలర్లలో డిపాజిట్లు స్వీకరించి వాటిని రూపాయిల్లో రుణాలుగా ఇస్తే, మారకపు విలువల్లో భారీ మార్పులు వచ్చినప్పుడు ప్రమాదం పెరుగుతుంది. దీనిని నివారించడానికి హెడ్జింగ్ తప్పనిసరి. కానీ హెడ్జింగ్‌కు కూడా వ్యయం ఉం టుంది. అందుకే రిజర్వ్ బ్యాంక్ ఈసారి ప్రత్యేక స్వాప్ సౌకర్యాన్ని కల్పించింది. మరో ప్రమాదాన్ని ఆర్థికవేత్తలు సడన్ స్టాప్ రిస్క్ అంటారు.
ప్రపంచంలో ఏదైనా సంక్షోభం ఏర్పడి ఎన్‌ఆర్‌ఐలు ఒకేసారి తమ డాలర్లను వెనక్కి తీసుకోవాలనుకుం టే బ్యాంకులపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. టర్కీ, అర్జెంటీనా వంటి దేశాలు విదేశీ కరెన్సీపై అధికంగా ఆధారపడటం వల్ల ఎదుర్కొన్న సమస్యలు దీనికి ఉదాహరణలు. భారత్ పరిస్థితి వాటిలా కాకపో యినా, అలాంటి ప్రమాదాలను పూర్తిగా విస్మరించే పరిస్థితి లేదు.
అందుకే విదేశీ మారక నిల్వలను చూసేటప్పుడు ఒకే సంఖ్యను కాదు, దాని వెనుక ఉన్న నిర్మాణాన్ని కూడా చూడాలి. ఈ పరిస్థితుల్లో భారత్‌కు నిజంగా అవసరమైనది విదేశీ డిపాజిట్లు కాదు, విదేశీ ఆదాయం. ఎగుమతులు పెరగాలి. అధునాతన తయారీ రంగం విస్తరించాలి. ప్రపంచ సరఫరా గొలుసుల్లో భారత వాటా పెరగాలి. సేవారంగం మరింత విదేశీ మారకాన్ని సంపాదించాలి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరగాలి. అప్పుడు మాత్రమే డాలర్లు దేశంలోకి శాశ్వతంగా వస్తాయి.
విదేశీ కరెన్సీ డిపాజిట్లు తప్పు కాదు. అవసరమైన సమయంలో అవి శక్తివంతమైన ఆర్థిక ఆయుధమే. కానీ కేవలం ఆయుధాలపైనే ఆధారపడి యుద్ధం గెలవలేం. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేది ఉత్పత్తి, ఎగుమతులు, ఆవిష్కరణలు, పోటీతత్వం. డాలర్లను అప్పుగా సమీకరించడం తాత్కాలిక ఉపశమనం మాత్రమే; డాలర్లను సొంతంగా సంపాదించే ఆర్థిక వ్యవస్థను నిర్మించడమే దీనికి శాశ్వత పరిష్కారం.
డి.జైరాం






