2 July, 2026 | 1:17 AM

కాపలాదారులే దోపిడీదారులైతే!

02-07-2026 12:00 AM

దేశంలో ప్రజాస్వామ్యానికి, సుపరిపాలనకు వెన్నెముక సివిల్ సర్వీసెస్ వ్యవస్థ. చట్టాన్ని అమలు చేయడం, ప్రజా వనరులను సంరక్షించడం, ప్రభుత్వ విధానాలను ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా అమలు చేయడం ఈ వ్యవస్థ ప్రధాన బాధ్యత. కానీ, చట్టాన్ని కాపాడాల్సిన వారే చట్టంలోని బలహీనతలను తమ లాభాల కోసం వినియోగించడం ఆందోళనకంర.

మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల భూ కుంభకోణం, అదే రాష్ట్ర లోకాయుక్త పనితీరుపై బయటపడిన గణాంకాలు, అలాగే తెలంగాణలో బయటపడుతున్న భూవ్యవహారాల వివాదా లు, ఇవన్నీ కలిసి భారత పాలనా వ్యవస్థలో దాగి ఉన్న ఒక నగ్నసత్యాన్ని బయటపెడుతున్నాయి. మధ్యప్రదేశ్ లోకాయుక్త గత ఇరవై ఏళ్ల అధికారిక గణాంకాలు ఒక చేదు వాస్తవాన్ని చెబుతున్నాయి. 2006 నుంచి 2026 వరకు కోర్టులు లోకాయుక్త కేసుల్లో 2,067 మందిని దోషులుగా నిర్ధారించాయి.

కానీ అదే కాలంలో 966 మంది నిర్దోషులుగా విడుదల కాగా, మరో 105 మంది కేసులు విచారణ దశకే చేరలేదు. మొత్తం 1,071 కేసుల్లో, అంటే దాదాపు 34 శాతం సందర్భాల్లో, అవినీతి నిరోధక వ్యవస్థ కోర్టులో తన వాదనను నిలబెట్టలేకపోయింది. 2025 71 మందికే శిక్ష పడగా, 62 మంది నిర్దోషులుగా బయటపడ్డారు. ఇది దర్యాప్తు నాణ్యత, సాక్ష్యాల సమర్పణ, కేసుల నిర్వహణలో తీవ్రమైన లోపాలను సూచిస్తోంది. శిక్షపడిన వారిలో 85 శాతం మంది అత్యల్ప స్థాయి ఉద్యోగులే. రెవెన్యూ శాఖలో 652 కన్విక్షన్లలో 558 మంది పట్వారీలు. పోలీస్ శాఖలో 321 కేసుల్లో 242 మంది కానిస్టేబుళ్లు లేదా హెడ్ కానిస్టేబుళ్లు. విద్యుత్ శాఖలో 194 కేసుల్లో 91 మంది లైన్‌మెన్లు. కానీ ఐఏఎస్, ఐపీఎస్, డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారుల వాటా ఒక శాతానికీ చేరలేదు.

ఇక్కడే వ్యవస్థలోని వర్గ వివక్ష బయటపడుతోంది. ఈ అసమానతకు భోపాల్ సమీపంలోని గురాడీఘాట్ భూ వ్యవహారం ప్రత్యక్ష ఉదాహరణ. 2022 ఏప్రిల్ 4న ఒకే రోజున, ఒకే రిజిస్టర్డ్ పత్రం ద్వారా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, తెలంగాణ కేడర్లకు చెందిన దాదాపు 50 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు గురాడీఘాట్‌లో 2.023 హెక్టార్ల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. భూమి కొనుగోలు జరిగిన 16 నెలలకే, 2023 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం రూ.3,200 కోట్ల వ్యయంతో వెస్టర్న్ బైపాస్ ప్రాజెక్టును ఆమోదించింది.

ఆశ్చర్యకరంగా ఆ ప్రతిపాదిత రహదారి ఈ భూమికి 500 మీటర్ల దూరంలోనే వెళ్లేలా ప్రణాళిక రూపొందింది. ప్రభుత్వ ప్రాజెక్టులపై ముందస్తు సమాచారం లేకుండా ఇలాంటి పెట్టుబడి సాధ్యమా? 2024 జూన్‌లో అదే భూమిని వ్యవసాయ వినియోగం నుంచి నివాస వినియోగానికి మార్చడంతో ధరలు అమాంతం పెరిగాయి. 2022లో రూ.81.75 ఉన్న చదరపు అడుగు ధర ప్రస్తుతం రూ.2,500 నుంచి రూ.3,000కి పెరిగింది. తీవ్ర ఆరోపణలు వచ్చినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం మరింత ఆందోళనకరం. చివరకు 62 మంది మాజీ సివిల్ సర్వెంట్లతో కూడిన ఒక బృందం ముఖ్యమంత్రికి లేఖ రాసి స్వతంత్ర విచారణ జరపాలని డిమాండ్ చేయాల్సి వచ్చింది.

మధ్యప్రదేశ్‌లోనే కాదు, తెలంగాణలోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం భూదాన్ భూముల వ్యవహారంలో ఉన్నతాధికారులు, వారి బంధువులు, బినామీల పేర్లతో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయన్న ఆరోపణలను హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ హెచ్చరించినట్లే, చట్టం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసే వ్యవస్థ న్యాయబద్ధంగా లేకపోతే సమానత్వం కాగితాలకే పరిమితమవుతుంది. ప్రభుత్వాలు ఇప్ప టికైనా స్పందించి ఉన్నతాధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై స్వతం త్ర విచారణలు జరిపించాలి.  లేనిపక్షంలో ప్రజాస్వామ్యం ప్రమాదకర దశలోకి జారిపోతుంది.

పాపని నాగరాజు