22 July, 2026 | 3:27 AM

ఆలోచించి చెబుతా

09-06-2024 01:38 AM

కాంగ్రెస్ సభాపక్ష నేత హోదాపై రాహుల్ తర్జనభర్జన

లోక్‌సభా పక్ష నేతగా ఉండాలని నేతల విజ్ఞప్తి

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా ఎన్నిక

సీడబ్ల్యూసీ మీటింగ్‌లో ఏకగ్రీవ తీర్మానం

న్యూఢిల్లీ, జూన్ 8: కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేతగా రాహుల్ గాంధీని సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండాలని సమావేశంలో నేతలంతా ముక్తకంఠంతో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సమా వేశంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ప్రతిపక్ష నేతగా ఉండటంపై తాను ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని రాహుల్ గాంధీ చెప్పారని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.

ప్రస్తుతం కాంగ్రెస్‌కు లోక్‌సభలో 100 మంది ఎంపీల బలం ఉంది. ‘ఎన్నికల సమయంలో పేదరికం, మహిళల సమస్యలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలను లేవనెత్తాం. వీటిని పార్లమెంటులో లేవనెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అందుకు రాహుల్ గాంధీ సమర్థుడు అని సీడబ్ల్యూసీ సమావేశంలో నేతలందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు’ అని కేసీ వేణుగోపాల్ అన్నారు. కాగా, సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ..  సార్వత్రిక ఎన్నికల్లో నియంతృత్వానికి ప్రజలు సరైన సమాధానం చెప్పారని బీజేపీపై విమర్శలు చేశారు.

ప్రతిపక్ష నేతగా ఉంటే?

మొత్తం ప్రతిపక్షానికి ప్రధాన ప్రతిపక్ష నేత ప్రాతినిథ్యం వహిస్తారు. ప్రతిపక్షంలో అతిపెద్ద పార్టీకి లేదా కూటమి పార్టీలకు ఆ నేత లీడర్‌గా వ్యవహరిస్తారు. ప్రధాన ప్రతిపక్ష పోస్టులో ఉన్న నేత కేంద్రం తీసుకునే అనేక నిర్ణయాల్లో కీలక ప్రాత పోషిస్తారు. పబ్లిక్ అకౌంట్స్, పబ్లిక్ అండర్‌టేకింగ్స్, అంచనాల కమిటీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీలు తదితర కమిటీల్లో ప్రతిపక్ష నేత సభ్యుడిగా ఉంటారు. అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, కేంద్ర సమాచార కమిషన్, సీబీఐ, ఎన్‌హెచ్‌ఆర్సీ, లోక్‌పాల్ వంటి ఎంపిక కమిటీల్లో ఆయన సభ్యుడిగా ఉండి కీలకంగా వ్యవహరిస్తారు. 

దేన్ని వదులుకుంటారో..?

రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాల నుంచి గెలుపొందారు. ఈ రెండు స్థానాల్లో ఏ స్థానాన్ని వదులుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. జూన్ 17వ తేదీ లోపు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ అంశంపై రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వేణుగోపాల్ చెప్పారు.

ఆహ్వానం అందలేదు..

ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారానికి తమకు ఎలాంటి ఆహ్వానం అందలేదని సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. అయితే ఒకవేళ ఆహ్వానం వస్తే కార్యక్రమానికి హాజరు కావాలా వద్దా అనేదానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పా రు. మోదీ ప్రమాణస్వీకారానికి అంతర్జాతీయ నేతలనే ఆహ్వానించారని, ఇక్కడి వారికి ఆహ్వానం పంపలేదని పేర్కొన్నారు.

సీపీపీ అధ్యక్షురాలిగా సోనియా

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) అధ్యక్షురాలిగా సోనియా గాంధీని సీడబ్ల్యూసీ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆమె ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. ‘సోనియా గాంధీని పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నుకు నేందుకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రతిపాదించారు. మేమంతా ఆమె ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం’ అని  మాణిక్కం ఠాగూర్ వివరించారు.