అగ్రరాజ్యాల సరసన భారత్

20-04-2024 02:06:00 AM

l కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ 

l ఖమ్మంలో బీజేపీ అభ్యర్థి  తరఫున ప్రచారం

ఖమ్మం , ఏప్రిల్ 19 (విజయక్రాంతి): అగ్రరాజ్యాల సరసన భారత్ చేరిందని.. ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకున్నదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. బీజేపీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి వినోద్‌రావు విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం స్థానిక ప్రకాశం స్టేడియంలో బహిరంగ సభలో రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడారు. మోదీ హయాంలో 25 లక్షల నిరుపేదలను ఉన్నత స్థానానికి చేర్చామని స్పష్టంచేశారు. గత ప్రభుత్వాలు పేదరిక నిర్మూలన చేస్తామన్నారు కానీ వారివల్ల సాధ్యం కాలేదని చెప్పారు.

అంతర్జాతీయ సమాజంలో ఒకప్పుడు భారత్ అంటే లెక్కలేదని.. నేడు భారత్ చెప్పింది వినే స్థాయికి చేరుకున్నదని పేర్కొన్నారు. తెలంగాణా సాధనలో  బీజేపీ పాత్ర మరువలేనిదని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడ్డ తరువాత నీతి నిజాయితీ గల ప్రభుత్వం వస్తుందని ప్రజలు ఆశించారు. కానీ, అవినీతిమంతమైన ప్రభుత్వాలు వచ్చాయని ఆరోపించారు. ఓటు వేసి గెలిపించిన ప్రజలు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు.  ఖమ్మం అభ్యర్థి వినోద్‌రావును గెలిపించి ఢిల్లీకి పంపించాలని పిలుపునిచ్చారు.      

రాజ్‌నాథ్ హెలీకాప్టర్ తనిఖీ

లోకసభ ఎన్నికల ప్రచార నిమిత్తం ఖమ్మం జిల్లాకు వచ్చిన కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రయాణించిన హెలికాప్టర్‌ను ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ చేసింది.