7 July, 2026 | 5:49 AM

ఛెత్రీ వీడ్కోలు

17-05-2024 01:48 AM

రిటైర్మెంట్ ప్రకటించిన భారత ఫుట్‌బాల్ కెప్టెన్

మైదానంలో అడుగుపెడితే చాలు పాదరసంలా కదిలే నైపుణ్యం!

ప్రత్యర్థుల కాళ్ల ముందు నుంచి బంతిని లాగేసుకునే చాతుర్యం!

కనుసైగలతో సహచరులకు దిశానిర్దేశం చేయగల నాయకత్వం!!

విల్లు ఎక్కుపెడితే పక్షి కన్ను తప్ప మరొకటి కనిపించని పార్థుడిలా.. 

బరిలోకి దిగితే ప్రత్యర్థిలోని సగం బలాన్ని లాగేసుకునే వాలీలా..

ఊతమిస్తే సముద్రాన్ని లంఘించగల హనుమంతుడిలా..

రెండు దశాబ్దాల పాటు.. భారత ఫుట్‌బాల్ జట్టుకు వెన్నెముకగా నిలిచిన సునీల్ ఛెత్రీ ఆటకు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం ఆటలో కొనసాగుతున్న వారిలో అత్యధిక గోల్స్ చేసిన జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఛెత్రీ.. వచ్చే నెల 6న దేశం తరఫున తన చివరి మ్యాచ్ ఆడనున్నాడు. తెలంగాణ గడ్డపై పుట్టి.. సికింద్రాబాద్‌లో ఫుట్‌బాల్ ఓనమాలు నేర్చుకొని ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు గడించిన సునీల్ ఛెత్రీ.. 39 ఏళ్ల వయసులో సాకర్‌కు టాటా చెప్పాడు. అత్యుత్తమ ఫిట్‌నెస్, అంతకుమించి క్రీడా నైపుణ్యంతో ఇన్నాళ్లు అభిమానులను అలరించిన ఛెత్రీ.. చివరిసారిగా కువైట్‌తో మ్యాచ్‌లో బ్లూ జెర్సీలో దర్శనమివ్వనున్నాడు. స్ట్రయికర్‌గా, సారథిగా భారత ఫుట్‌బాల్ ప్రమాణాలు పెంచడంతో పాటు.. ఇన్నాళ్లు దేశ సాకర్ ముఖచిత్రంలా నిలిచిన ఛెత్రీ బాధాతప్త హృదయంతో రిటైర్మెంట్ ప్రకటించాడు.

న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్, స్టార్ స్ట్రయికర్ సునీల్ ఛెత్రీ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా వచ్చే నెల 6న కువైట్‌తో మ్యాచ్ అనంతరం ఆటకు వీడ్కోలు పలకనున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు గురువారం ఛెత్రీ సోషల్ మీడియా వేదికగా వీడియో సందేశం విడుదల చేశాడు. దాదాపు 10 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో ఛెత్రీ తన భావాలు వ్యక్తం చేశాడు. 2005లో దాయాది పాకిస్థాన్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఛెత్రీ.. ఆ తర్వాత అంచలంచెలుగా ఎదుగి భారత ఫుట్‌బాల్ ముఖచిత్రంలా మారాడు. జాతీయ జట్టు తరఫున ఇప్పటి వరకు 150 మ్యాచ్‌లాడిన ఛెత్రీ.. అందులో 94 గోల్స్ కొట్టాడు. ప్రస్తుతం ఫుట్‌బాల్‌లో కొనసాగుతున్న ఆటగాళ్లలో ఇది మూడో అత్యధికం. క్రిస్టియానో రొనాల్డో (128 గోల్స్, పోర్చుగల్), లియోనెల్ మెస్సీ (106 గోల్స్, అర్జెంటీనా) ముందున్నారు. ఓవరాల్‌గా ఆల్‌టైమ్ అత్యధిక గోల్ స్కోరర్స్‌లో ఛెత్రీ నాలుగో స్థానంలో ఉన్నాడు. గత కొన్నాళ్లుగా ఈ నిర్ణయం ప్రకటించాలననుకుంటున్నట్లు వెల్లడించిన 39 ఏళ్ల ఛెత్రీ.. అంతర్జాతీయ కెరీర్‌లో చివరి మ్యాచ్‌ను తనకిష్టమైన కోల్‌కతాలో ఆడనున్నాడు. ‘కెరీర్‌లో ఎన్నో గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయి. గత 19 ఏళ్లలో.. బరువు బాధ్యతలు, ఒత్తిడి, అమితానందం ఇలా ఎన్నో అనుభవించా.

ఇన్నాళ్లు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తానని అనుకోలేదు. చివరి మ్యాచ్ ఆడేందుకు సమయం ఆసన్నమైందనుకుంటున్నా. గత కొన్నాళ్ల నుంచి దీని గురించి ఆలోచిస్తుంటే కొత్తగా అనిపిస్తోంది. కువైట్‌తో మ్యాచ్ మాకు చాలా ముఖ్యం. తదుపరి రౌండ్‌కు అర్హత పొందాలంటే ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలి. జట్టుకు ఎంత ముఖ్యమైన మ్యాచో.. వ్యక్తిగతంగా నాకూ అంతే ప్రధానమైంది. రిటైర్మెంట్ గురించి కుటుంబ సభ్యులతో చెప్పినప్పుడు నాన్న అర్థం చేసుకున్నారు. కానీ అమ్మతో పాటు నా భార్య బావురుమన్నారు. వారు ఏడ్వడం చూసి భావోద్వేగానికి గురయ్యా. నాలోని పిల్లాడు మాత్రం ఫుట్‌బాల్‌కు దూరం కావద్దని పదే పదే చెబుతున్నాడు. కల నిజం చేసుకునే అవకాశం వచ్చినందుకు నేను ఎంతో అదృష్టవంతుడిని’ అని వీడియోలో ఛెత్రీ పేర్కొన్నాడు. 

ఒక శకం ముగిసింది!

క్రికెట్ మాయలో పడి మిగతా క్రీడలను పట్టించుకోని.. మన అభిమాన గణం సాకర్‌ను కాస్తో కూస్తో ఆదరించిందంటే అది కేవలం సునీల్ ఛెత్రీ వల్లే అనడంలో రవ్వంత అతిశయోక్తి లేదు. సాధారణంగా సాకర్‌లో ప్రత్యర్థులతో గొడవలు.. అంపైర్లతో వాగ్వాదాలు సర్వ సాధారణం. ఇలాంటి మోడ్రన్ ఎరాలోనూ ఛెత్రీ ఏనాడు గీత దాటలేదు, హద్దు మీరలేదు. అటు మైదానంలోనే కాకుండా.. బయట కూడా తన వ్యక్తిత్వంతో ఎందరో యువ ఆటగాళ్లు ఫుట్‌బాల్ కెరీర్‌గా ఎంచుకునేలా నిలిచాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు.. అంతర్జాతీయ అరంగేట్ర మ్యాచ్‌లోనే ఛెత్రీ సూపర్ గోల్‌తో మెరిశాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై గోల్స్ ఖాతా తెరిచిన ఛెత్రీ.. అర్జున, ఖేల్త్న్ర పురస్కారాలతో పాటు దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అందుకున్నాడు. పాకిస్థాన్‌పై అరంగేట్రంలోనే గోల్ కొట్టడంతో తానెప్పుడు మరవలేనన్న ఛెత్రీ.. మెరుగైన భవిష్యత్తు దిశగా ఆలోచించాల్సిన అవసరం వచ్చిందని అన్నాడు. ప్రత్యర్థులతో సైతం స్నేహశీలి అని కితాబు పొందిన ఛెత్రీ తన కెరీర్లో మూడు సార్లు హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిశాడు.

దేశం తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా.. అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగా.. జాతీయ జట్టుకు అత్యధిక కాలం సారథ్యం వహించిన నాయకుడిగా.. ఒకటా రెండా.. ఇలా లెక్కకు మిక్కిలి ఘనతలు తన పేరిట లిఖించుకున్న ఛెత్రీ.. ఆటలో ప్రమాణాలు మరింత పెంచుతూ ముందుకు సాగాలని పేర్కొన్నాడు.సికింద్రాబాద్‌లో పుట్టి పెరిగిన ఛెత్రీ.. 2002లో తొలిసారి మోహన్ బగాన్ క్లబ్ తరఫున ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ కెరీర్ ప్రారంభించాడు. చిన్నతనంలో అయిష్టంగా ఆటకు దగ్గరైన ఛెత్రీ.. తండ్రి కలను సాకారం చేసే క్రమంలో సాకర్‌తో ప్రేమలో పడ్డాడు. 2001 ఢిల్లీ సిటీ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించడం అతడి కెరీర్‌ను మలుపుతిప్పింది. ఆ కుర్రాడి ప్రతిభ గుర్తించిన మోహన్ బగాన్ క్లబ్.. అతడితో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోని సునీల్.. అంచలంచెలుగా ఎదుగుతూ సమున్నత శిఖరాలు అధిరోహించాడు. 2011లో బైచుంగ్ భూటియా స్థానంలో జాతీయ జట్టు సారథ్య బాధ్యతలు అందుకున్న ఛెత్రీ.. ఎన్నో మ్యాచ్‌ల్లో ఒంటరి పోరాటంతో జట్టును గట్టెక్కించాడు.

సహచరుల నుంచి పెద్దగా సహకారం లభించని సమయంలో కూడా సునీల్ తన విలువ చాటుకున్నాడు. భారత్ మూడు సార్లు (2007, 2009, 2012) నెహ్రూ కప్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన ఛెత్రీ.. దేశానికి మూడు (2011, 2015, 2021) సాఫ్ (దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య) టైటిల్స్ అందించాడు. సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికిన సందర్భంగా భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీతో పాటు పలువురు క్రీడాకారులు, రాజకీయ నాయకులు అతడి ఘనతలను కీర్తించారు. ‘ఎంతో నిబద్దత, పట్టుదల, కృషి ఉంటేగానీ రెండు దశాబ్దాల పాటు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించలేం. అనునిత్యం నేర్చుకోవాలనే తపన.. ఎప్పటికప్పుడు మెరుగు పడాలనే ఆలోచన వల్లే ఛెత్రీ ఈ స్థాయికి చేరుకోగలిగాడు. అతడు భారత ఫుట్‌బాల్‌కు చేసిన కృషి వెల కట్టలేనిది’ అని భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా పేర్కొన్నాడు. ఆటగాడిగా కొనసాగుతున్న సమయంలోనే ఛెత్రీ దిగ్గజ స్థాయిని అందుకున్నాడని.. అతడు నెలకొల్పిన ప్రమాణాలు ఉన్నతమైనవని భారత ఫుట్‌బాల్ హెడ్ కోచ్ స్టిమాక్ వెల్లడించాడు.