ఐదు దేశాల పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ సంక్షోభం మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi begins UAE visit) శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీలలో ఆరు రోజుల పర్యటనకు బయలుదేరారు. ఇంధన ప్రవాహాలను పరిరక్షించడం, పశ్చిమ ఆసియా సంక్షోభం వల్ల కలిగే వాణిజ్య అంతరాయాలను తగ్గించడం, కీలక సాంకేతికతలలో సహకారాన్ని పెంపొందించడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యాలుగా ఉంటాయని భావిస్తున్నారు.
రాబోయే ఆరు రోజుల్లో భారత్ ప్రపంచ భాగస్వామ్యాలను బలోపేతం చేసే లక్ష్యంతో కూడిన విస్తృత అజెండాపై పీఎం మోదీ పలు ప్రపంచ నాయకులతో సంప్రదింపులు జరుపుతారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్ మీడియాలో తెలిపారు. ప్రధాని మోదీ ముందు యూఏఈలో పర్యటించనున్నారు. అక్కడ ఆయన అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో భారత్-యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి సారించి విస్తృత చర్చలు జరపడంతో పాటు, పశ్చిమ ఆసియా వివాదంపై అభిప్రాయాలను పంచుకుంటారు.
ప్రధానమంత్రి ఐరోపా పర్యటనకు బయలుదేరే ముందు, ఆ గల్ఫ్ దేశంలో సుమారు నాలుగు గంటల పాటు ఉంటారు. మోదీ-అల్ నహ్యాన్ చర్చల అనంతరం, ద్రవీకృత పెట్రోలియం వాయువు (LPG) వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల రంగాలలో సహకారాన్ని పెంపొందించేందుకు, భారత్, UAE రెండు కీలక ఒప్పందాలను ఖరారు చేసే అవకాశం ఉంది. అమెరికా, ఇరాన్ మధ్య తీవ్రమవుతున్న సంఘర్షణ ప్రపంచ ఇంధన మార్కెట్లను తీవ్రంగా అస్థిరపరిచింది. ప్రపంచ మొత్తం పెట్రోలియం సరఫరాలో సుమారు 20 శాతం ప్రవహించే అత్యంత కీలకమైన రవాణా మార్గమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్'ను టెహ్రాన్ దిగ్బంధించడం ఇందుకు ప్రధాన కారణం. ద్వైపాక్షిక వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను పెంపొందించడంపై కూడా ప్రధాని మోదీ, అధ్యక్షుడు అల్ నహ్యాన్ చర్చించే అవకాశం ఉందని పీఎంవో వర్గాలు వెల్లడించాయి.






