25 August, 2026 | 2:47 AM

ముగిసిన భారత్ పోరాటం

25-08-2026 12:07 AM

అర్జెంటీనా చేతిలో ఓటమి

సెమీస్ చేరకుండానే నిష్క్రమణ

అమస్టెల్వీన్, ఆగస్టు 24: పురుషుల హాకీ ప్రపంచ కప్‌లోనూ భారత్ కు నిరాశే మిగిలింది. మహిళల జట్టు తరహాలోనే భారత పురుషుల హాకీ జట్టు సెమీఫైనల్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో అర్జెంటీనా చేతిలో 5-3 తేడాతో భారత్ ఓడిపోయింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో మొదటి క్వార్టర్లో మూడు గోల్స్ నమోదయ్యాయి.

అర్జెంటీనా రెండు గోల్స్ ఆధిక్యంలోకి దూసుకెళ్లగా, భారత్ ఒక గోల్ చేసి ఆధిక్యాన్ని తగ్గించింది. కేవలం 39 సెకన్లలోనే అర్జెంటీనా ఆటగాడు జోక్విన్ టోస్కాని తొలి గోల్ చేయగా, కొన్ని నిమిషాల తర్వాత నికోలస్ డి లా టోర్రే మరో గోల్ కొట్టి ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. అయితే భారత్ తరఫున సుఖ్జీత్ సింగ్ భారత్ తరఫున తొలి గోల్ చేసి ఆధిక్యాన్ని 2-1కి తగ్గించాడు.

మూడో క్వార్టర్లో టోమాస్ డోమెన్ అర్జెంటీనా తరఫున మరో రెండు గోల్స్ సాధించి జట్టు ఆధిక్యాన్ని 4-1కి పెంచాడు. చివరి క్వార్టర్లో టొస్కానీ మరో గోల్ కొట్టడంతో ఆ జట్టు గోల్స్ సంఖ్య ఐదుకు పెరిగింది. ఆఖర్లో సుఖ్జీజ్ మరో గోల్తో మెరవడంతో ఆధిక్యం 5-2కు తగ్గింది. మరో నిమిషంలో ఆట ముగస్తుందనగా భారత్కు పెనాల్టీ స్ట్రోక్ లభించింది. దీనిని సద్వినియోగం చేసుకుంటూ సుఖ్జీత్ సింగ్ గోల్గా మలిచినప్పటికీ అప్పటికే మ్యాచ్ చేజారింది.అటు ప్రపంచకప్ టోర్నీలో టీమిండియా మహిళల జట్టు కూడా సెమీఫైనల్కు చేరలేకపోయింది.