జైస్వాల్, ఫెర్నాండోపై ఐసీసీ చర్యలు
ఇద్దరికీ మ్యాచ్ ఫీజులో జరిమానా
డీ మెరిట్ పాయింట్ కేటాయింపు
దుబాయి, ఆగస్టు 24: కొలంబో టెస్టులో టీమ్‌ఇండియా బ్యాటర్ యశస్వీ జైస్వాల్, శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండో మధ్య జరిగిన గొడవను ఐసీసీ సీరియస్‌గా తీసుకుంది. మైదానంలోనే మాటల యుద్ధానికి దిగడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఈ ఇద్దరూ ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు పేర్కొంటూ మ్యాచ్ ఫీజులో చెరో 25 శాతం కోత విధించింది.
అలాగే ఇద్దరు ఆటగాళ్లకు చెరో ఒక డీ మెరిట్ పాయింట్ చేర్చింది. తొలి ఇన్నింగ్స్ లో దూకుడుగా ఆడుతున్న జైస్వాల్ ను ఫెర్నాండో ఒక అద్భుతమైన డెలివరీతో 45 పరుగుల వద్ద క్లీన్ బౌల్ చేశాడు. వికెట్ తీసిన అనంతరం ఫెర్నాండో అత్యుత్సాహంగా సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో అతను ఏదో మాట అన్నాడు.
దీంతో జైస్వాల్ ఆగ్రహంతో అతనిపైకి దూసుకెళ్లాడు. ఒకరికొకరు ఎదురెదురుగా నిలబడి నోరుపారేసుకున్నారు. ఈ క్రమంలో జైస్వాల్ హెల్మెట్ ఫెర్నాండో నుదుటికి తాకింది. దాంతో శ్రీలంక కెప్టెన్ ధనంజయ డిసిల్వా, వైస్ కెప్టెన్ కమిందు మెండీస్ జోక్యం చేసుకొని ఇద్దర్నీ విడదీసాడు.ఈ ఘటనలో యశస్వి జైస్వాల్దే తప్పంటూ మాజీ క్రికెటర్లు, కామెంటేటర్లు తీర్పు ఇచ్చారు. దాంతో యశస్వి జైస్వ్పా నిషేధం పడుతుందని అంతా అనుకున్నారు. కానీ మ్యాచ్ రిఫరీ లెవెల్-1 నేరంగా పరిగణించి రూల్స్ ప్రకారం చర్యలు తీసుకున్నారు.






