సోలార్‌పై తెలుగు రాష్ట్రాల నిరాసక్తి
- రాయితీ ఉన్నా దరఖాస్తుకు వెనుకడుగు
- 14, 16 స్థానాల్లో ఏపీ, తెలంగాణ
- ముందంజలో అస్సాం, గుజరాత్, మహారాష్ట్ర
హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): రూప్ టాప్ (ఇంటిపై కప్పు) సౌర విద్యుత్తు రాయితీ పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు తెలుగు రాష్ట్రాలు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. బీహార్, ఒడిశా, అస్సాం వంటి రాష్ట్రాలతో పోల్చినా ఏపీ, తెలంగాణ వెనుకంజలో ఉన్నాయి. అవగాహన లేమీ, పాలకుల నుంచి ప్రోత్సాహం లభించకపోవడం, ఉచిత విద్యుత్తు పథకాలే దానికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
దేశవ్యాప్తంగా కోటి మంది ప్రజలకు ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద రూప్‌టాప్ సౌర విద్యుత్ ఏర్పాటుకు రాయితీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఒక్కో ఇంటిపై గరిష్ఠంగా 3 కిలోవాట్లకు రూ.78 వేల చొప్పున రాయితీ ఇస్తామని ప్రకటించింది. గత ఫిబ్రవరి నుంచి ఆన్‌లైన్ దరాఖాస్తులను స్వీకరిస్తోంది. ముందు దరఖాస్తు చేసినవారికి ముందుగానే రాయితీ సొమ్ము విడుదల చేస్తామని నిబంధన విధించింది. తెలుగు రాష్ట్రాల నుంచి దరఖాస్తులు ఆశించిన మేరకు రాలేదని, కేంద్ర పునరుత్పాదక మంత్రిత్వశాఖ ఒక నివేదికలో తెలిపింది.
తెలంగాణ 14, ఏపీలో 16 స్థానాల్లో..
దేశవ్యాప్త గణాంకాలను పరిశీలిస్తే అత్యధికంగా అస్సాం 2.23 లక్షలు, గుజరాత్‌లో 2.14 లక్షలు, మహారాష్ట్ర 1.91 లక్షలు, ఉత్తరప్రదేశ్ నుంచి 1.89 లక్షల దరాఖాస్తులో వరుసగా తొలి 4 స్థానాల్లో నిలిచాయి. ఏపీలో 29,740, తెలంగాణలో 17,152 దరఖాస్తులతో 14, 16 స్థానాల్లో ఉన్నాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే కొన్ని చోట్ల కనీసం 100 మంది కూడా దరఖాస్తు చేసుకునేందుకు ముందుకురాలేదు. తెంగాణలో అత్యధికంగా మేడ్చల్‌లో 2,266 మంది దరాఖాస్తు చేసుకోగా అత్యల్పంగా సిరిసిల్ల జిల్లాలో ముగ్గురే స్పందించారు. ఏపీలో కాకినాడ నుంచి అత్యధికంగా 1,315, అత్యల్పంగా అల్లూరి జిల్లా నుంచి 178 మాత్రమే వచ్చాయి.
గుజరాత్‌లో అహ్మదాబాద్ జిల్లా నుంచి 18,452 దరఖాస్తులు రాగా, హైదరాబాద్ నుంచి కేవలం 1,296 మాత్రమే వచ్చాయి. ఇతర రాష్ట్రాలలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సొమ్ముకు అదనంగా కొంత కలిపి ఇస్తుండటం, ప్రజలను ఆ దిశగా ప్రోత్సహించడంతో రూప్‌టాప్ సౌర విద్యుత్ ఏర్పాటుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అది లోపించింది. రాష్ట్రంలో ఒక్కో ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌ను ఇస్తుండటం వెనుకబాటుకు కారణమని డిస్కంలు విశ్లేషిస్తున్నాయి.






