ఇందిరమ్మ గృహ విప్లవం
కోరుట్లలో అత్యధిక గృహ ప్రవేశాలు
కోరుట్ల, జూన్ 26 (విజయక్రాంతి): జిల్లా లోని పేదలకు గౌరవప్రదమైన నివాసం కల్పించి, వారు ఆత్మ గౌరవముతో జీవించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతి ష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇం డ్ల పథకం జగిత్యాల జిల్లాలో గృహ విప్లవానికి నాంది పలుకుతోంది. గుడిసెలు, అద్దె ఇళ్లు, శిథిలావస్థలో ఉన్న నివాసాల్లో జీవనం సాగిస్తున్న పేద కుటుంబాలకు శాశ్వత గృహ భద్రత కల్పించాలనే సంకల్పంతో చేపట్టిన ఈ కార్యక్రమం జిల్లాలో ఆశాజనక ఫలితాలను అందిస్తోంది.
వేలాది కుటుంబాల సొంతింటి కలను నిజం చేస్తూ ఇందిరమ్మ ఇండ్లు పేదల జీవితాల్లో కొత్త ఆశలను నింపుతున్నాయి. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మొత్తం 10,860 ఇళ్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జిల్లాలో గృహ అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. మంజూరైన ఇళ్లలో ఇప్పటికే 9,020 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మరో 1,840 ఇళ్లను త్వరలోనే గ్రౌండింగ్ చేసి నిర్మాణాలు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోంది.జిల్లాలో ప్రస్తుతం 7,885 ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో కొనసాగుతున్నాయి. వీటిలో 1,311 ఇళ్లు బేస్మెంట్ దశలో ఉండగా, 820 ఇళ్లలో గోడల నిర్మాణం పూర్తయింది. 4,186 ఇళ్లలో ఆర్సీసీ స్లాబ్ పనులు పూర్తయ్యాయి. మరో 1,568 ఇళ్లు నిర్మాణపరంగా పూర్తయ్యాయి. 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కింద మే 2026 చివరి నాటికి 3,136 గృహ ప్రవేశాలు నిర్వహించాలని లక్ష్యంగా నిర్ణయించింది.
ఈ లక్ష్య సాధనలో భాగంగా జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే 2,512 గృహ ప్రవేశాలు విజయవంతంగా నిర్వహించడం ద్వారా లక్ష్యాల సాధనలో జగిత్యాల జిల్లా గణనీయమైన పురోగతిని నమోదు చేస్తోంది. కోరుట్ల నియోజకవర్గంలో 3,204 ఇళ్లకు మంజూరు లభించింది. 481 ఇళ్లు నిర్మాణపరంగా పూర్తయ్యాయి. మొత్తం 2,148 ఇళ్లు నిర్మాణ పురోగతిలో ఉన్నాయి. ఇప్పటికే 755 గృహ ప్రవేశాలు నిర్వహించడం ద్వారా జిల్లాలోనే గృహ ప్రవేశాల సంఖ్యలో కోరుట్ల అగ్రస్థానంలో నిలిచింది.






