15 April, 2026 | 11:32 AM

అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారిగా ఇందిరమ్మ ఇల్లు

10-06-2025 12:23 AM

వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు.

హనుమకొండ, జూన్ 9 (విజయ క్రాంతి): పేదవారి సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో హన్మకొండ అంబేడ్కర్ భవన్ నందు వర్ధన్నపేట నియోజకవర్గం 1, 2, 3, 43, 44, 45, 46, 55, 56, 64, 65, 66వ డివిజన్ల పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు  సుమారు 750 మందికి మంజూరు పత్రాలను మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే లతో కలిసి అందజేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ దశల వారిగా ఇందిరమ్మ ఇల్లును ప్రభుత్వం మంజూరు చేస్తుందని  అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో 175కోట్లతో 3500 ఇల్లు నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. ఇందులో ఒక్కో ఇంటికి 5లక్షల చొప్పున 4 విడతలలో నేరుగా లబ్ధిదారు ఖాతాలలో జమ చేయనున్నట్లు తెలిపారు. 

ఏ సమస్య ఉన్న నా డయల్ యువర్ ఎమ్మెల్యే 8096107107 కి ఫోన్ చేసి మీ సమస్య తెలియజేసే త్వరితగతన మీ సమస్య పరిష్కరించే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఆయా డివిజన్లకు సంబంధించిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను  ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్, అదనపు కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ రవీందర్, డిఈ సిద్ధార్థ నాయక్,  ఇతర అధికారులు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, లబ్ధిదారులు, మహిళలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.