‘ఏఐ’కార్యకలాపాలు పెంచండి
- చందన్‌వెల్లి డేటా సెంటర్ త్వరగా ఏర్పాటు చేయాలి
- సునీల్ మిట్టల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి
- ఎయిర్‌టెల్‌కు రెండో హెడ్‌క్వార్టర్‌గా హైదరాబాద్
- డేటా సెంటర్ల సామర్థ్యం పెంచుతాం
- సునీల్ మిట్టల్ హామీ
హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి) : హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్ డిజిటల్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీతో పాటు ఏఐ కార్యకలాపాలపైన దృష్టి సారించాలని పారిశ్రామికవేత్త, భారతీ ఎంటర్ ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ బోధీ పెవిలియన్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సునీల్ భారతి మిట్టల్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణలో చేపట్టిన అనేక కార్యక్రమాలు, సంస్కరణలు, పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిన అంశాలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. ప్రత్యేకంగా విద్యా రంగంలో తీసుకొస్తున్న సంస్కరణలు, ప్రభుత్వ పాఠశాల ప్రక్షాళన తీరుపై మిట్టల్‌కు వివరించారు. పారిశ్రామిక రంగ అవసరాలకు అనుగుణంగా యువతలో నైపుణ్యాలను పెంపొందించడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు, ఐటీఐలను అధునాతన సాంకేతిక విధానాలతో ఏటీసీలుగా మార్పు, పాలిటెక్నిక్ కాలేజీల అధునీకరణ అంశాలను వివరించారు.
చందన్‌వెల్లి డేటా సెంటర్‌ను తొందరగా ప్రారంభించాలని, తెలంగాణలో పెద్ద సమగ్ర డేటా సెంటర్, ఏఐ మౌలిక సదుపాయాల క్యాంపస్ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. భవిష్యత్ పెట్టుబడి అవకాశాలు, సమస్యలను పరిష్కరించడం కోసం తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేలా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ను నామినేట్ చేసి సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు
భారతీ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ఏటీసీల్లో చదువుకునే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేస్తామని సునీల్ మిట్టల్ తెలియజేశారు. అలాగే ఎయిర్‌టెల్‌కు రెండో హెడ్ క్వార్టర్‌గా హైదరాబాద్‌ను పరిగణిస్తున్నామని చెప్పారు. డేటా సెంటర్ల సామర్థ్యాన్ని మరింత పెంచడానికి సిద్ధంగా ఉన్నామని, తెలంగాణలో ఫైబర్ కనెక్టివిటీ మరింత పెంచుతామని సునీల్ మిట్టల్ హామీ ఇచ్చారు.






