7 July, 2026 | 5:06 AM

10% పెరిగిన ఇండ్ల ధరలు

17-05-2024 12:09 AM

క్రెడాయ్ రిపోర్ట్

న్యూఢిల్లీ, మే 16: రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్‌కు ఏర్పడిన డిమాండ్ ఫలితంగా ఈ ఏడాది జనవరి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో హౌసింగ్ ధరలు నిరుడు ఇదేకాలంతో పోలి స్తే సగటున 10 శాతం పెరిగినట్టు క్రెడాయ్, కొల్లియర్స్, లియాసెస్ ఫోరాస్‌లు సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక తెలిపింది. అయితే 2023 డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే ధరలు సగటున 27 శాతం పెరిగినట్టు వెల్లడించింది. పూనే, ముంబై, బెంగ ళూరు, ఢిల్లీఎన్‌సీఆర్ నగరాల్లో ధరలు రెండంకెల్లో పెరిగాయన్నది. ప్రధాన నగరాల్లోకెల్లా బెంగళూరులో అత్యధికంగా 19 శాతం ధరలు పెరిగాయి. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఇండ్ల ధరలు 16 శాతం, పూనేలో 13 శాతం చొప్పున ఎగిసాయి. హైదరాబాద్‌లో 9 శాతం పెరిగాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో విక్రయానికి ఉన్న గృహాల సంఖ్య 3 శాతం పెరగ్గా, పూనేలో మాత్రం 10 శాతం తగ్గాయని రిపోర్ట్ తెలిపింది. ఢిల్లీఎన్‌సీఆర్, అహ్మదాబాద్‌ల్లో అన్‌సోల్డ్ ఇన్వెంట రీ 8 శాతం తగ్గాయని పేర్కొంది. ఈ ఏడాది మార్చి చివరినాటికి 8 ప్రధాన నగరాల్లో అన్‌సోల్డ్ ఇన్వెంటరీ 10 లక్షల యూనిట్ల వరకూ ఉన్నాయని, ఇందులో ముంబై మెట్రో రీజియన్‌దే 40 శాతం వాటా ఉన్నదని వివరించింది. హైదరాబాద్, బెంగళూరు ల్లో గత ఏడాది జనవరి పోలిస్తే ఇన్వెంటరీ పెరిగినప్పటికీ, 2023 డిసెంబర్ కంటే స్వల్పంగా తగ్గాయని వెల్లడించింది. 

ప్రీమియం, లగ్జరీ ఇండ్లకు డిమాండ్

దేశంలో రెసిడెన్షియల్ హౌసింగ్‌కు, ప్రత్యేకించి ప్రీమియం, లగ్జరీ గృహాలకు డిమాండ్  ఉన్నందున ధరలు పెరుగుతున్నాయని క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ బోమన్ ఇరానీ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ జోరు తగ్గుతుందని భావించడం లేదన్నారు. ఈ ఏడాది రిజర్వ్‌బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గిస్తే ఈఎంఐ చెల్లింపుల ద్వారా గృహాలు కొనేవారు పెరుగుతారని కొల్లియర్స్ ఇండియా సీఈవో బాదల్ యాగ్నిక్ చెప్పారు.