ఎం అండ్ ఎం లాభం 32% అప్
ఆదాయం రూ.25,109 కోట్లు
షేరుకు డివిడెండు రూ.21.10
న్యూఢిల్లీ, మే 16: ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.2,038 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదేకాలంలో నమోదుచేసిన రూ.1,549 కోట్ల లాభంతో పోలిస్తే తాజా త్రైమాసికంలో 32 శాతం పెరిగింది. కంపెనీ ఆదాయం 11 శాతం వృద్ధి చెంది రూ.22,571 కోట్ల నుంచి రూ. 25,109 కోట్లకు చేరింది. గురువారం సమావేశమైన ఎం అండ్ ఎం డైరెక్టర్ల బోర్డు షేరు కు రూ.21.10 చొప్పున డివిడెండు సిఫార్సుచేసింది. ముగిసిన క్యూ4లో కంపెనీ ఇబిటా 22 శాతం పెరిగి రూ.2,831 కోట్ల నుంచి రూ. 3,446 కోట్లకు పెరిగింది.
21.5 లక్షల వాహనాల విక్రయం
ఈ ఏడాది జనవరి త్రైమాసికం లో ఎం అండ్ ఎం 21.5 లక్షల వాహనాల్ని విక్రయించింది. రికార్డుస్థాయిలో 1.26 లక్షల యుటిలిటీ వాహనాలు విక్రయమయ్యాయి. ప్రస్తుతం కంపెనీ వద్ద 2.2 లక్షల ఎస్‌యూవీలకు ఆర్డర్ బుక్ ఉన్నది. తమ వ్యాపారాలన్నీ మంచి పనితీరును ప్రదర్శించాయని, ఆటో విభాగం అధిక వృద్ధి బాటలో ఉన్నదని, వ్యవసాయ విభాగం మార్కెట్ వాటా పెంచుకున్నదని ఎం అండ్ ఎం సీఈవో అనీశ్ షా చెప్పారు. ఆటో విభాగం పన్నుకు ముందు లాభం 49 శాతం పెరిగి రూ.1,751 కోట్లకు చేరగా, పీబీఐటీ మార్జిన్ 170 బేసిస్ పాయింట్లు పెరిగి 8.8 శాతం వద్ద నిలిచింది. వ్యవసాయ యంత్రాల ఆదాయం 44 శాతం రూ.225 కోట్లకు పెరగ్గా, ట్రాక్టర్ల మార్కెట్ వాటా 130 బేసిస్ పాయింట్లు తగ్గి 39.4 శాతానికి చేరింది. ఫలితాల వెల్లడి తర్వాత ఎం అండ్ ఎం షేరు 3 శాతంపైగా ర్యాలీ జరిపి ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయి రూ.2,390 వద్ద ముగిసింది.
ఈవీ వ్యాపారంలో రూ.12,000 కోట్ల పెట్టుబడులు
ఎం అండ్ ఎం ఎలక్ట్రిక్ వాహన వ్యాపారాన్ని నిర్వహిస్తున్న సబ్సిడరీ మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ (ఎంఈఏఎల్)లో రూ.12,000 కోట్లు పెట్టుబడి చేసేందుకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.






