calender_icon.png 6 December, 2024 | 4:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్కెట్‌కు ద్రవ్యోల్బణం దెబ్బ

16-10-2024 12:24:33 AM

153 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్

ముంబై, అక్టోబర్ 15: రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 5 శాతాన్ని మించడం, హెవీవెయిట్ షేరు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) 2 శాతం క్షీణించడంతో మార్కెట్ నేలచూపులు చూసింది. మంగళవారం ఇంట్రాడేలో 337 పాయింట్ల వరకూ తగ్గిన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు 153  పాయింట్లు నష్టంతో 81,304 పాయింట్ల కనిష్ఠస్థాయిని తాకిన అనంతరం చివరకు 230 పాయింట్ల తగ్గుదలతో  81,830 పాయింట్ల వద్ద నిలిచింది.

ఇదేబాటలో  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ  70 పాయింట్ల నష్టంతో  కీలకమైన 25,057  పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సెప్టెంబర్ నెలలో ద్రవ్యోల్బణం 5.59 శాతంగా నమోదుకావడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలహీనపర్చిందని ట్రేడర్లు తెలిపారు.

అంతర్జాతీయ ట్రెండ్ మిశ్రమంగా ఉండటం, రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగిందున ఆర్బీఐ రేట్ల తగ్గింపులో జాప్యం జరుగుతుందన్న అంచనాలతో ఇన్వెస్టర్లు పాక్షికంగా లాభాల స్వీకరణ జరిపారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.

ద్రవ్యోల్బణం 5.49 శాతానికి చేరడం మానిటరీ పాలసీ కమిటీని ఆందోళనకు లోనుచేస్తుందని, వడ్డీ రేట్ల కోతను 2025వ సంవత్సరానికి వాయిదా వేయవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ చెప్పారు. 

రిలయన్స్ డౌన్..హెచ్‌సీఎల్ టెక్ అప్

సోమవారం ఆర్థిక ఫలితాల్ని వెల్లడించిన కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ క్షీణించగా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లాభపడింది. ఆయిల్ రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ వ్యాపారాలు బలహీనపనితీరు కారణంగా జూలై త్రైమాసికంలో ఆర్‌ఐఎల్ నికరలాభం 5 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. దీనితో ఈ షేరు 1.9 శాతం మేర తగ్గి రూ.2,690 వద్ద  ముగిసింది.

టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, మారుతిలు 1.5 శాతం వరకూ తగ్గాయి. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంవ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు 2 శాతం వరకూ లాభపడ్డాయి. ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ క్యూ2లో నికరలాభాన్ని 10.51 శాతం పెంచుకున్నది. అంతేకాకుండా పూర్తి ఆర్థిక సం వత్సరానికి రెవి న్యూ గైడెన్స్‌ను పెంచింది.