25-11-2025 02:45:32 PM
బిసి జేఏసీ ఆగ్రహం
నాగర్‌కర్నూల్,(విజయక్రాంతి): జిల్లాలో బీసీలపై జరుగుతున్న అన్యాయంపై బిసి –జేఏసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం 460 గ్రామ పంచాయితీ సర్పంచ్ స్థానాల్లో బీసీలకు కేవలం 61 (13.3%) మాత్రమే కేటాయించడంపై నాయకులు మండిపడ్డారు. జిఓ.46 ప్రకారం బీసీలకు 23% రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉన్నా, జిల్లాలో కేవలం 13.3% మాత్రమే కల్పించారని ఆరోపించారు. ఎస్టి లకు 133 (29%), ఎస్సీ లకు 85 (18.5%) కేటాయించడంతో మొత్తం రిజర్వేషన్లు 60% దాటాయని, ఇది సుప్రీంకోర్టు విధించిన 50% క్యాప్‌కు విరుద్ధమని బిసి –జేఏసీ నాయకులు పేర్కొన్నారు.
బీసీలు ఓటర్లలో 50–56% ఉన్నా, సర్పంచ్ స్థానాల్లో 13% మాత్రమే రావడం తీవ్ర అన్యాయమన్నారు. అమ్రాబాద్ మండలంలోని ఐదు గ్రామాలను ఎస్టీ రిజర్వ్‌గా ప్రకటించినప్పటికీ, అక్కడ ఒక్క ఎస్టీ ఓటరు కూడా లేని కారణంగా ఎన్నికలు నిర్వహించే ఆస్కారం లేదన్నారు. వెంటనే ఈ కేటాయింపులను మార్చాలని బిసి –జేఏసీ డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఏవో చంద్రశేఖర్ కి వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో శివ శంకర్ యాదవ్ మ్యాకల, కుంభం మల్లేష్ గౌడ్, డా. కాళ్ల నిరంజన్, అరవిందాచారి, చిక్కొండ్ర శ్రీశైలం, నారమోని నరేష్ తదితరులు పాల్గొన్నారు.