24-04-2025 01:43:15 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ పరిధి రోజురోజుకూ విస్తరిస్తోంది. జనాభా కూడా క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వేసవి వచ్చిందంటే పలుప్రాంతాల్లో నీటికష్టాలు ఎదురవుతున్నాయి. నగరంలోని ప్రైమ్‌ఏరియాల్లో నీటిఎద్దడి ఎక్కువగా ఉంటోంది. కొన్నేళ్లుగా మంచి వర్షాలే పడు తున్నప్పటికీ నగరంలోని ఎక్కువ భాగం కాంక్రీట్‌మయం కావడంతో వరదనీరు భూమిలోకి ఇంకడం లేదు.
వర్షపునీటిని భూమిలోకి ఇంకే విధంగా చేయడం అత్యంత అవసరమని నిపుణులు చెబుతుంటారు. నీటి సంరక్షణలో ఇంకుడు గుంతలు కీలకపాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో పలువురు నగర వాసులకు వచ్చిన ఆలోచనతో వారి కాలనీల్లో ఇంకుడు గుంతల నిర్మించుకుని నీటి ఇక్కట్లు తొలగించుకున్నారు. ఒకటి రెండు వర్షాలకే వారి ప్రాంతాల్లో బోర్లు రీఛార్జ్ కావడంతో పాటు, సంవత్సరం పొడవునా బోర్లు ఎండిపోకుండా ఉంటున్నాయి.
ముషీరాబాద్ బోలక్‌పూర్ పద్మశాలీ కాలనీలో రెండు దశాబ్దాల క్రితమే ఇంకుడు గుంతలను నిర్మించడం గమనార్హం. ఇంకుడు గుంతలు నిర్మించాక ఆ ప్రాంతాల్లో నీటి కష్టాలు తొలగిపోవడం విశేషం. సమిష్టి కృషితో సాధించుకున్న ఈ విజయానికి అభినందనలు తెలుపుతూ ‘విజయక్రాంతి’ అందిస్తున్న కథనం ఇది..
గతంలో ముషీరాబాద్ పద్మశాలీ కాలనీలో వేసవి మొదలైందో లేదో భూగర్భజలాలు అడుగంటేవి. కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడే వారు. వర్షాకాలంలో వరద నీటిని వృథా చేయకుండా తిరిగి భూమిలోకి పంపేందుకు ఇంకుడు గుంతలు నిర్మించాలని ఆ కాలనీకి చెందిన ఉద్యోగి ఆంజనేయులు ఆలోచన చేశారు. ఇదే విషయమై కాలనీవాసులతో చర్చించి ఇంకుడు గుంతలను నిర్మించారు.
1998 ఆగస్టు 1న వాటిని అప్పటి ఎమ్మెల్యే కోదండరెడ్డి ప్రారంభించారు. సామాజిక బాధ్యతతో నగరంలో నిర్మించిన ఇంకుడుగుంతలు ఇవే మొదటివని అంటున్నారు. ఇంకుడుగుంతలు తవ్విన ఆ ఏడాది రెండో వర్షానికే అడుగంటిన ఓ బోర్‌లోకి మళ్లీ నీళ్లు వచ్చాయి. ఇంకుడు గుంతల మేలును గమనించిన కాలనీవాసులు 60 ఇండ్లలో ఇంకుడు గుంతలను నిర్మించుకున్నారు.
ఎంఎన్‌కే విఠల్ సెంట్రల్ కోర్ట్ అపార్టుమెంట్‌లో..
సికింద్రాబాద్ బోయిగూడలోని ఎంఎన్‌కే విఠల్ సెంట్రల్ కోర్టు అపార్ట్‌మెంట్‌లో నాలుగేండ్ల క్రితం నీటిఎద్దడి తీవ్రంగా ఉండేది. 90 ప్లాట్లు ఉండే ఈ అపార్ట్‌మెంట్ వాసుల అవసరాల కోసం ప్రతీ ఏడాది ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చుకునేందుకు ప్రతీ ఏడాది రూ.4 ఖర్చుచేసేవారు.
ఈ నేపథ్యంలో అపార్ట్ మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అపార్ట్‌మెంట్ ఆవరణలో 35ఇంకుడు గుంతలను, మరో 2 ఫౌంటెన్ ఇంకుడు గుంతలను రెండున్నరేండ్ల క్రితం నిర్మించారు. దాదాపు 200ఫీట్ల లోతు, 15 ఫీట్ల వెడల్పుతో ఈ ఫౌంటేన్ ఇంకుడుగుంతలను నిర్మించారు. దీంతో నీటి సమస్యకు చెక్‌పడింది.
అక్టోబర్ జలమండలి ప్రత్యేక డ్రైవ్
వేసవి వచ్చిందంటేచాలు నగరంలోని అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, మణికొండ, తదితర ప్రాంతాల్లో నీటి కష్టాలు ఎదురవుతున్నాయి. దీంతో జలమండలి సరఫరా చేసే వాటర్‌ట్యాంకర్లకు ఈ ప్రాంతాల నుంచి భారీగా డిమాండ్ ఏర్పడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ ఉన్న ప్రాంతాలపై రెండేళ్లుగా జలమండలి దృష్టి సారించింది.
జల సత్యనారాయణ అనే ప్రతే ్యక అధికారిని ఏర్పాటు చేసి ఆ ప్రాంతాల్లో సర్వే నిర్వహించి, బోర్లు ఎండిపోయినట్లు గుర్తించింది. ఆ ప్రాంతవాసుల ఇండ్ల లో ఇంకుడు గుంతలు నిర్మించుకుంటే నీటి సమస్యకు చక్కని పరిష్కారం ఉంటుందని సూ చించింది. ఇంకుడు గుంతలు నిర్మించుకున్న నాగోల్ కోఆపరేటివ్ కాలనీ, బండ్లగూడ, కొత్తపేట హుడా కాంప్లెక్స్ అపార్ట్‌మెంట్లు, తదితర ప్రాం తాల్లో సత్ఫలితాలు కూడా వచ్చాయి.
కాగా గతేడాది అక్టోబర్ 2న నగరంలోని ప్రతీ ఇంట్లో ఇంకుడు గుం తలు తప్పనిసరి చేస్తూ స్పె షల్ డ్రైవ్ చేపట్టిం ది. దాదా పు 41వేల ఇండ్లను సర్వే చేసి ఇంకుడుగుంతలు లేని వారికి నోటీసులిచ్చి నిర్మించుకోవాలని చెప్పింది. ఇంకుడు గుం తలు లేకపోతే వాటర్ ట్యాంకర్‌ను సరఫరా చేసేది లేదని తేల్చిచెప్పింది.
మహాత్మాగాంధీ ఇంట్లో ఇంకుడు గుంత..
గుజరాత్‌లోని పోరుబందర్‌లో జాతిపిత మహాత్మాగాంధీ నివసించిన ఇంట్లో ఇంకుడు గుంత ఉంది. 1777లో కట్టిన ఆ ఇంటి పైకప్పు నుంచి వచ్చిన వర్షం నీటిని తిరిగి భూమిలోకి పంపించేలా ఆ కాలంలోనే మహాత్మాగాంధీ వాళ్ల తాత ఆ ఇంటిని నిర్మించారు. కొన్నేండ్లుగా ఇంకుడు గుంతల నిర్మాణంపై మేం పనిచేస్తున్నాం. ఈ నేపథ్యంలో మహాత్మాగాంధీ ఇంటిని సందర్శించాం.
ఆ ఇంటిని చూసి స్ఫూర్తి పొందాం. ఇంకుడుగుంత నిర్మించుకోవడం వల్ల ప్రస్తుత నీటి అవసరాలు తీరడంతోపాటు, భవిష్యత్ తరాలకు నీటిని అందించినవారమవుతాం. 1998 నుంచి ఇంకుడు గుంతల నిర్మాణం కోసం సామాజిక బాధ్యతతో మా బృందం పని చేస్తోంది. ఆసక్తి ఉన్నవారికి సలహాలు సూచనలు ఇస్తోంది.
విజయక్రాంతితో ఆంజనేయులు,
పద్మశాలి కాలనీ అధ్యక్షుడు
ఇంకుడుగుంతల నిర్మాణం తప్పనిసరి చేయాలి
నాలుగేండ్లుగా నీటికోసం కష్టాలు పడ్డాం. 37 ఇంకుడు గుంతల నిర్మాణంతో మా అపార్ట్‌మెంట్‌వాసులకు నీటి సమస్య తీరింది. ప్రతీ ఏడాది నీటి కోసం రూ.4 ఖర్చు చేసేవాళ్లం. ఇంకుడు గుంతలు నిర్మించాక ప్రతీ ఏడాది వాటర్ ట్యాంకర్ల కోసం వెచ్చించే డబ్బులు ఆదా అవుతున్నాయి. మా చుట్టుపక్కల వారికీ ప్రయోజనం కలుగుతోంది. నగరంలో కొత్తగా నిర్మిస్తున్న భవనాలు, అపార్ట్‌మెంట్‌లలో ఇంకుడుగుంతలను తప్పనిసరిగా నిర్మించుకోవాలి.
డాక్టర్ హనుమాండ్లు, ఎంఎన్‌కే విఠల్ సెంట్రల్ కోర్ట్ అపార్ట్‌మెంట్
అసోసియేషన్ అధ్యక్షుడు, బోయిగూడ