14 March, 2026 | 1:26 PM

కోదాడలో కల్తీ వంట నూనె కలకలం

14-03-2026 12:20 PM

కోదాడ,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కల్తీ వంట నూనె దందా వెలుగులోకి రావడం స్థానికంగా కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ట్యాంకర్లలో కల్తీ వంట నూనెను తీసుకొచ్చి కోదాడలో బ్రాండెడ్ కంపెనీ కాళీ డబ్బాల్లో నింపుతున్నట్టు పోలీసులు గుర్తించారు.ఈ కల్తీ నూనెను కొంతమంది స్థానిక వ్యాపారులు కొనుగోలు చేసి పట్టణంలోని పలు కిరాణా దుకాణాలు, హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఆ నూనెనే వినియోగదారులకు అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

గత కొన్నేళ్లుగా కోదాడ పరిసర ప్రాంతాల్లో కల్తీ వంట నూనె దందా విచ్చలవిడిగా కొనసాగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. తాజాగా హైవే పక్కన ట్యాంకర్ నుంచి కల్తీ నూనెను అన్‌లోడ్ చేస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.ఈ ఘటనపై టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని నూనె శాంపిల్స్ సేకరించి పరిశీలన కోసం పంపించారు. ఇంత జరుగుతున్నా కోదాడలో కల్తీ వంట నూనె దందా మాత్రం ఆగడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.