20 August, 2026 | 2:54 AM

ఇన్‌పుట్ డీలర్లు రైతులకు సాంకేతిక సహాయకులుగా పనిచేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్

20-08-2026 12:00 AM

చుంచుపల్లి, ఆగస్టు 19, (విజయక్రాంతి): శిక్షణ పూర్తి చేసుకున్న ఇన్పుట్ డీలర్స్ రైతులకు సాంకేతిక సహాయకులుగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ అంకిత కోరారు. బుధవారం చుంచుపల్లి రైతు వేదికలో దేశీ శిక్షణ పూర్తి చేసుకున్న 39 మంది ఇన్పుట్ డీలర్లకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇన్పుట్ డీలర్లు. వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతికత, శాస్త్రీయ సాగు పద్ధతులు, ప్రత్యామ్నాయ పంటల సాగు తదితర అంశాలను రైతులకు చేరవేస్తూ, వారి ఆదాయం పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. జిల్లాలో పంటల మార్పిడి, ఆయిల్పామ్, కూరగాయలు, మిరప తదితర ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని కలెక్టర్ అన్నారు.

ఒకే రకమైన పంటలను వరుసగా సాగు చేయడం వల్ల భూసారంపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగు, భూసార పరిరక్షణ, సేంద్రియ కర్బనాన్ని పెంపొందించే పద్ధతులపై అవగాహన కల్పించాలని సూచించారు. నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటలను ఎంపిక చేసుకునేలా తగిన సాంకేతిక సూచనలు అందించాలని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో జిల్లాలో సుమారు 37 శాతం లోటు వర్షపాతం నమోదైన నేపథ్యంలో నీటి లభ్యతకు అనుగుణంగా రైతులు పంటలను ఎంపిక చేసుకునేలా సూచనలు ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. 

అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్ చుంచుపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించిన కలెక్టర్, ప్రజలకు అందుతున్న రెవెన్యూ సేవలు, దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ, పెండింగ్లో ఉన్న దరఖాస్తుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాదా బైనామా కింద వచ్చిన దరఖాస్తుల సంఖ్య, పరిష్కరించినవి, పెండింగ్లో ఉన్నవి, ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయనే వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు.  కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీవో సుభాషిని, ఫెసిలిటేటర్ డేవిడ్ జైపాల్ రావు, వ్యవసాయ శాఖ ఏవోలు, వ్యవసాయ శాఖ అధికారులు, ఇన్పుట్ డీలర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.