20 August, 2026 | 1:28 AM

సూరయ్యపల్లె -సీతంపేట రహదారి పనులకు మంత్రుల శంకుస్థాపన

20-08-2026 12:00 AM

రూ.29.94 కోట్లతో 10.8 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ

మంథని, ఆగస్టు 19 (విజయక్రాంతి) మంథని మండలంలోని సూరయ్యపల్లె నుంచి కాకర్లపల్లె మీదుగా ముత్తారం మండలంలోని ఇప్పలపల్లి, సీతంపేట, ఖమ్మం పల్లి గ్రామపంచాయతీ శుక్రవారం పల్లి వరకు 10.8 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ పనులకు రూ.29.94 కోట్ల నిధులతో బుధవారం శంకుస్థాపన చేశారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.

సూరయ్యపల్లె, కాకర్లపల్లె, సీతంపేటతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు ఈ రహదారి అభివృద్ధితో మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుందని, రైతులు వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు, విద్యార్థులు, ఉద్యోగులు రాకపోకలు సాగించేందుకు ఈ రహదారి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముసుకుల సహేందర్రెడ్డి, మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఐలి ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్తో పాటు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు. తదితరులు పాల్గొన్నారు.