వచ్చి చూసి చెబితేనే చేస్తారా?
పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశీలించండి
భూత్పూర్, ఆగస్టు 12 (విజయక్రాంతి): పాఠశాలలో పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీ వచ్చి చూసి తనిఖీలు చేస్తేనే పరిశుభ్రం చేస్తాం అంటే ఎట్లా అని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్‌ఎస్)లో పారిశుద్ధ్య చర్యలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ బుధవారం పరిశీలించారు.
పాఠశాల ఆవరణలో ఎక్కడా చెత్త, వ్యర్థ పదార్థాలు పేరుకుపోకుండా చూడాలని, పిచ్చిమొక్కలు, పొదలు, కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. ముఖ్యంగా పాములు దాగేందుకు అవకాశం ఉన్న పొదలు, చెత్తాచెదారం, ఇతర ప్రదేశాలను పూర్తిగా శుభ్రం చేయాలని ఆదేశించారు. విద్యార్థులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ పాము కాట్ల నివారణకు అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. పాఠశాల పరిసరాల్లో పారిశుద్ధ్య ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.






