మచ్చ బొల్లారం అంగన్‌వాడీ కేంద్రంలో తనిఖీ
మేడ్చల్, ఆగస్టు 18 (విజయక్రాంతి): మచ్చ బొల్లారం అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కే ఆనంద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలోని మౌలిక వసతులు, పరిశుభ్రత, పిల్లల హాజరు, పోషకాహార పంపిణీ, ఆరోగ్య సేవలు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు.
చిన్నారులకు అందిస్తున్న భోజనం నాణ్యత-పరిమాణంతో పాటు, కేంద్రంలో సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయా లేదా అని తనిఖీ చేశారు.బియ్యం, పప్పులు, కూరగాయలు తదితర నిర్దేశిత ఆహార పదార్థాల నిల్వలను పరిశీలించడంతో పాటు, గుడ్లు, మరియు ఇతర పోషకాహార పదార్థాలు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. స్టాక్ రిజిస్టర్ను పరిశీలించి, ఆహార పదార్థాల నాణ్యత, గడువు తేదీలను కూడా తనిఖీ చేశారు. అదేవిధంగా, పిల్లల ఆరోగ్య పరిస్థితి, ఎదుగుదల, పోషకాహార స్థితిపై ప్రత్యేకంగా ఆరా తీశారు.
ముఖ్యంగా సామ్-మామ్ పిల్లలు ఎంతమంది ఉన్నారు, వారికి అందుతున్న చికిత్స, పోషకాహారం, ఫాలోఅప్ ఎలా జరుగుతోంది అనే వివరాలను అంగన్వాడీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు నిరంతర పర్యవేక్షణ, వైద్య సేవలు అందేలా చూడాలని సూచించారు.పిల్లల ఆరోగ్య సేవలకు సంబంధించిన రికార్డులు, పోషణ్ కార్యక్రమాల అమలు, ఆరోగ్య పరీక్షలు, టీకాలు తదితర వివరాలను కూడా డా. కె. ఆనంద్ పరిశీలించారు.ప్రతి చిన్నారి ఆరోగ్యం,పోషకాహారం మరియు ఎదుగుదలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలు నాణ్యతతో ఉండేలా చూడాలని డా. కె. ఆనంద్ సిబ్బందికి సూచించారు.






