12-11-2025 01:23:00 AM
-సైబరాబాద్ పరిధిలో హైఅలర్ట్
-హైటెక్ సిటీ దుర్గం చెరువు రాయదుర్గం
- పరిసరాల్లో పోలీసులు క్షుణ్ణ నిఘా
శేరిలింగంపల్లి, నవంబర్ 11 (విజయక్రాంతి): ఢిల్లీలో నిన్న జరిగిన పేలుడు ఘటనతో హైదరాబాద్ భద్రతా వ్యవస్థ తక్షణమే సజాగ్రత్త మోడ్లోకి వెళ్లింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ప్రధాన కేంద్రాల్లో పోలీసులు కట్టుదిట్టమైన నిఘా కొనసాగిస్తున్నారు. కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు మాదాపూర్ డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో మంగళవారం విస్తృత తనిఖీలు జరిగాయి. అడిషనల్ డీసీపీ ఉదయ్రెడ్డి, ఏసీపీ శ్రీధర్ సమన్వయంతో సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ బృందం హైటెక్ సిటీ, దుర్గం చెరువు, రాయదుర్గం మెట్రో స్టేషన్లలో తనిఖీలు చేపట్టింది.
ప్రయాణికుల లగేజీలు, వాహనాలు, పార్కింగ్ ప్రాంతాలు, చెరువు పరిసరాలు ఏ మూల వదల్లేదు. ఈ తనిఖీల్లో సైబరాబాద్ సెక్యూరిటీ వింగ్, బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు పాల్గొన్నాయి. పీక అవర్స్లో రద్దీ ఎక్కువగా ఉండే మెట్రో ప్రవేశ ద్వారాల వద్ద పోలీసుల అదనపు బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రజల భద్రత దృష్ట్యా ఇది సాధారణ చర్య కాదని, ముందస్తు జాగ్రత్తగా చేపట్టిన ఆపరేషన్ అని పోలీసులు స్పష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు లేదా వస్తువులు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ సూచించారు.