12-11-2025 08:03:05 AM
ఇల్లెందు బీఆర్ ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎవరు..?
సిలివేరు సత్యనారాయణ, మహమ్మద్ జబ్బార్..!
సందిగ్ధంలో పార్టీ శ్రేణులు..
బయటపడ్డ వర్గపోరు
-ఇల్లెందు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారత రాష్ట్ర సమితిలో వర్గ పోరు మరోసారి బహిర్గతమైంది. ఇప్పటికే కొత్తగూడెం నియోజకవర్గం కమిటీపై నియోజకవర్గం ఇంచార్జ్ మాజీ మంత్రి మనమ వెంకటేశ్వరరావు మండిపడుతున్న తరుణంలో, ఇల్లందు పట్టణ కమిటీ వివాదం తెరమీదికి వచ్చింది. ఇల్లందు పట్టణ అధ్యక్ష పదవి నియామకం పై జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్చార్జి బానోత్ హరిప్రియ వేరు వేరు పేర్లను ప్రకటించడంతో రగడ మొదలై,అధ్యక్షుడు ఎవరనే సందిగ్ధం పార్టీ శ్రేణుల్లో ఏర్పడింది. రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలోని చుంచుపల్లి 1,2 తో పాటు జూలూరుపాడు, ఇల్లెందు నూతన అధ్యక్షులను నియమించినట్లు రేగా కాంతారావు పేర్కొన్నారు. అయితే ఇల్లెందు పట్టణ అధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మహమ్మద్ జబ్బార్ పేరును ప్రకటించిన కొద్దిసేపటికే, మాజీ ఎమ్మెల్యే ఇల్లెందు నియోజకవర్గ ఇన్చార్జి హరిప్రియ సిలివేరు సత్యనారాయణ ను పట్టణ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ప్రకటించడం సర్వత్ర చర్చనీయాంశమైంది.
పట్టణ అధ్యక్ష పదవికై నామినేషన్ వేసిన పేర్లను పూర్తిస్థాయిలో పరిశీలించి కేటీఆర్ ఆదేశాలు మేరకు నూతన అధ్యక్షుల పేర్లను ఖరారు చేసినట్లు జిల్లా అధ్యక్షుడు పేర్కొంటుండగా.. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారికి నియోజకవర్గ ఇన్చార్జిని సంప్రదించకుండానే నూతన అధ్యక్షుడిని ఎలా ప్రకటిస్తారంటూ మాజీ ఎమ్మెల్యే వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఇల్లెందు పట్టణ అధ్యక్ష పదవికి సంబంధించి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ప్రకటన చెల్లదంటూ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ సిలువేరు సత్యనారాయణ ప్రకటించడంతో ఇల్లందు, కొత్తగూడెం బి ఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు రాష్ట్ర పార్టీ అధిష్టానం వద్దకు ఇప్పటికే చేరినట్లు సమాచారం. ఇల్లందు పట్టణ అధ్యక్షుడి గా జిల్లా అధ్యక్షుడు ప్రకటించిన పేరు ఖరారు అవుతుందా, నియోజకవర్గ ఇన్చార్జి ప్రకటించిన పేరు ఖరారయిద్దో అని బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.