ఆన్‌లైన్ బెట్టింగ్.. అంతర్రాష్ట ముఠా అరెస్టు
అదుపులోకి 11 మంది నిందితులు
కరీంనగర్‌కు చెందిన బాధితుని ఫిర్యాదు మేరకు రంగంలోకి సిట్
సీఐడీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చారు సిన్హా
హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ డాఫాబెట్ ద్వారా దేశవ్యాప్తంగా వందల కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతున్న ఒక అంతర్రాష్ట్ర ముఠాను తెలంగాణ సీఐడీ సోమవారం అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా 11 మంది నిందితులను అదుపులోకి తీసుకోగా.. వారి వద్ద నుంచి 3 లగ్జరీ కార్లు, 8 ల్యాప్టాప్లు, 2 ఐప్యాడ్లు, 26 మొబైల్ ఫోన్లు, 5 పాస్‌పోర్టులు, రూ. 3.21 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
కరీంనగర్‌కు చెందిన ఓ బాధితుడు ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా దాదాపు రూ. 9.95 లక్షలు నష్టపోయానని ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన సిట్ విచారణ జరిపి ఈ ముఠాను పట్టుకుంది. ఈ సందర్భంగా సీఐడీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చారు సిన్హా మాట్లాడుతూ ఈ ముఠా వెనుక చాలా పెద్ద నెట్‌వర్క్ ఉందని, అక్రమ బెట్టింగ్ సొమ్మును దారి మళ్లించడానికి వీరు వివిధ రాష్ట్రాల్లోని 46 మ్యూల్ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించారని తెలిపారు.
ఈ ముఠా ప్రధానంగా క్రికెట్ బెట్టింగ్, క్యాసినో గేమ్స్, ఏవియేటర్ ప్లాట్‌ఫాముల ద్వారా బెట్టింగ్ కార్యకలాపాలను ప్రోత్సహించిందన్నారు. నమ్మకం కుదరడం కోసం మొదట్లో చిన్న చిన్న మొత్తాలను లాభాల రూపంలో బాధితుల ఖాతాల్లో వేసేవారని, అది నమ్మి బాధితులు పెద్ద మొత్తంలో డిపాజిట్లు చేశాక, అసలు రంగు బయటపెట్టి ముంచేసేవారని చెప్పారు.
డీఎస్పీ స్థాయి అధికారుల నేతృత్వంలోని సీఐడీ బృందాలు ఢిల్లీ, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో దాదాపు రెండు వారాల పాటు సుదీర్ఘ ఆపరేషన్ నిర్వహించి, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను ట్రాక్ చేసి అరెస్ట్ చేసినట్టు వివరించారు. ఈ ముఠాపై ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణలలో మొత్తం 225 ఫిర్యాదులు, 73 క్రిమినల్ కేసులు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. తెలంగాణలో ఇప్పటివరకు అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్‌కు సంబంధించి 414 కేసులు నమోదైనట్లు చీఫ్ చారు సిన్హా వెల్లడించారు.






