17 July, 2026 | 12:45 AM

పాక్‌కు అంతర్గత సవాల్

17-07-2026 12:00 AM

స్వరాజ్య కాంక్షే లక్ష్యంగా మిలిటెంట్ పోరాటాలతో రోజురోజుకు తన ప్రాబల్యాన్ని విస్తరించుకుంటూ పోతున్న బలూచిస్థాన్ ఒకవైపు, తమ ప్రాంత హక్కుల కోసం ప్రజా ఆందోళనలు చేస్తున్న పీవోకే మరోవైపు పాకిస్థాన్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మిలిటెంట్ గ్రూప్‌లను ప్రోత్సహిస్తూ, భారత్‌లో నిప్పుపెట్టి ఇన్నాళ్లు చలికాచుకున్న పాక్ ఇప్పుడు అంతర్గత ఉద్రిక్తతలతో సతమతమవుతున్నది.

బలూచిస్థాన్, పీవోకే ప్రాంతాల పట్ల దశాబ్దాలుగా కొనసాగుతున్న నిర్లక్ష్యం, అభివృద్ధిని విస్మరించడం, సహజ వనరుల దోపిడీపై గూడుకుట్టుకున్న అసంతృప్తి ఇప్పుడు తీవ్రరూపం దాల్చింది. ఈ రెండు ప్రాంతాలు భౌగోళికంగా, సామాజికంగా వేర్వేరు అయినప్పటికీ, వారి లక్ష్యం మాత్రం ఒక్కటే. అదేమిటంటే పాకిస్థాన్ పాలనకు స్వస్తి పలికి, స్వయంపాలన దిశగా అడుగులు వేయడం. పీవోకే విషయానికి వస్తే, అక్కడి చట్టసభలో శరణార్థులకు కేటాయించిన పన్నెండు స్థానాల అంశం పెద్ద వివాదానికి దారితీసింది.

స్థానికుల హక్కులపై దాడిగా భావిస్తున్న ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ పీవోకే ప్రజలు ఆందోళనలకు దిగారు. నిరసనకారులపై జరిపిన కాల్పుల్లో 12 మంది మరణించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది. ఇప్పటికే అధిక ధరలు, విద్యుత్ కొరత, నిరుద్యోగం వంటి సమస్యలతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రజల్లో ఇది మరింత ఆగ్రహాన్ని పెంచింది. మరోవైపు బలూచిస్థాన్ మొదటినుంచి పాకిస్థాన్‌కు సవాలు విసురుతూనే ఉన్నది.

పాక్ భూభాగంలో సుమారు నలభై శాతం విస్తీర్ణం కలిగిన బలూచిస్థాన్ సహజ వనరులతో కూడిన ఒక సుసంపన్నమైన ప్రాంతం. అక్కడి సముద్రతీర ప్రాంతం బలూచిస్థాన్‌కు వ్యూహాత్మక ప్రాధాన్యతను తెచ్చిపెట్టాయి. అయితే, సహజ వనరులను వాడుకుంటూ, స్థానికంగా అభివృద్ధిని గాలికొదిలేయడం బలూచ్ ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్షను రగిలించింది. బలూచ్ మిలిటెంట్లు పాకిస్థాన్‌ను ముప్పుతిప్పలు పెడుతుండగా, ఈ క్రమంలో పాక్ చేపడుతున్న సైనిక చర్యలు, అణచివేతలు ఈ ఉద్యమానికి మరింత ఆజ్యం పోశాయి.

దశాబ్దాలుగా పోరాడుతున్న మిలిటెంట్లు ఇప్పుడు స్వాతంత్య్రాన్ని ప్రకటించుకునే స్థాయికి చేరుకోవడం పాకిస్థాన్‌కు ఇబ్బందికరంగా మారింది. ఈ రెండు ప్రాంతాల ప్రజలు తమ హక్కులు, ఆత్మగౌరవం, స్వయంపాలనపై పోరాడుతున్న నేపథ్యంలో పాకిస్థాన్‌కు ఇకపై ఇది శాంతిభద్రతల సమస్య ఎంతమాత్రం కాదని చెప్పక తప్పదు. దేశ సమగ్రత, సమాఖ్య వ్యవస్థను సవాల్ చేసే స్థాయికి చేరుకున్న ఈ సమస్యను పాకిస్థాన్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.