21 May, 2026 | 10:07 PM

‘రామనారాయణ’పై విచారణ

19-06-2024 12:38 AM
  • హైకోర్టు ఆదేశాల మేరకు గోప్యత పాటిస్తున్న భద్రాద్రి అధికారులు
  • విచారణకు ఐదుగురితో కూడిన కమిటీ

భద్రాద్రి కొత్తగూడెం/ హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి):  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయంలో తలెత్తిన రామనారాయణ వివాదంపై మంగళవారం ఐదుగురు వేద పండితులతో ఏర్పాటుచేసిన కమిటీ విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశాలు, సూచనల మేరకు విచారణ అంశాల విషయంలో అధికారులు అత్యంత గోప్యతను పాటిస్తున్నారు. మూడు రోజులపాటు వివిధ వర్గాల నుంచి ఈ కమిటీ వివరాలు సేకరించనుంది. ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి, ఈవో రమాదేవి ఈ కమిటీతోపాటు పాల్గొన్నారు.

రంగనాయకుల గుట్టపై కాటేజీలో కమిటీ రామనారాయణ వివాదంపై  ఆలయ అర్చకులు, అభ్యంతరం వ్యక్తం చేసేవారిని విడివిడిగా వీడియో చిత్రీకరణ చేస్తూ వివరాలు సేకరించింది. సీతాదేవి గోత్రం గౌతమస, రాముడి గోత్రం వశిష్ట కాగా లక్ష్మీదేవి గోత్రం సౌభాగ్య, నారాయణుడి గోత్రం అచ్యుతలను అర్చకులు చదువుతున్నారని, సీతారాములకు బదులు లక్ష్మీదేవి , విష్ణుమూర్తిల గోత్రాలు ఎలా చదువుతారన్న వివాదం చాలా కాలంగా నడుస్తున్న విషయం విధితమే.  ఈ వివాదం కాస్త చిలికి చిలికి గాలివానై చివరికి కోర్టు మెట్లు ఎక్కింది. దీంతో హైకోర్టు ఆదేశానుసారం ఐదుగురు సభ్యుల కమిటీ వివాదంపై వివరాలు సేకరించే పనిలో పడింది.   

హైకోర్టులో మూడు రిట్ పిటిషన్లు..

ఎంతో ఆధ్యాత్మిక, సామాజిక చరిత్ర కలిగిన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో శతాబ్దాలుగా జరుగుతున్న సంప్రదాయాలను పక్కనపెట్టి కొత్త సంప్రదాయాలను కొనసాగిం చడంతో రామనారాయణ వివాదం తలెత్తింది. శతాబ్దాలుగా భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో పాంచరాత్ర సంప్రదాయంలో పూజాదికాలు, అలాగే శ్రీరామ నవమిరోజు స్వామివారి కళ్యాణం జరుగుతూ వస్తోంది.

అయితే 2010 తరువాత ఈ సంప్రదాయాల్లో కొంత మార్పులు కలిగాయని, శ్రీరాముడు, సీతాదేవి గోత్ర నామాల స్థానంలో లక్ష్మీదేవి, నారాయణుడి గోత్రనామాలను అర్చకులు చదువు తున్నారనే వివాదం మొదలయ్యింది. కొత్తగా శ్రీరాముడికి తండ్రి లేరని, సీతాదేవికి తల్లిలేరని, వారికి వారే తల్లి, తండ్రులుగా చెప్పడం మొదలు పెట్టడంతో వివాదం మరింత ముదిరింది. పాం చరాత్రం పేరుతో వీటిని అమలు చేయడం వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలోనే 2019లో రాష్ట్ర హైకోర్టులో మూడు రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి.

హైకోర్టు సూచనలతో కమిటీ 

ఈ రిట్ పిటిషన్లను విచారించిన హైకో ర్టు ఈ వివాదానికి గల కారణాలు, వాస్తవాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు వేద పండితులతో ఒక కమిటీని ఏర్పాటుచేసి విచారణ జరపాలని సూచించింది. దీని ప్రకారం పాంచరాత్రుల నుంచి ఇద్దరు, స్మార్తుల నుంచి ఇద్దరు, వైఖాసన నుంచి ఒకరి చొప్పున మొత్తం ఐదుగురితో ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. 

ప్రభుత్వం స్పందించాల్సి ఉంది

హర్కార శ్రీనివాసరావు, హైకోర్టు న్యాయవాది

శతాబ్దాలుగా కొనసాగుతున్న భద్రాచలంలోని ఆచారాలను ఎందుకు మార్చాల్సి వచ్చింది. అంతకు ముందు ఈ ఆచార, సంప్రదాయాలు, గోత్రనామాలు ఎలా ఉండేవి, మార్చడానికి కారణాలు ఏమిటి, మారిన తరువాత ఇవి ఎలా ఉన్నాయి.. దీనికి ప్రభుత్వం నుంచి ఏమన్నా అనుమతులు ఉన్నాయా.. ఇలా అనేక సమాచారం బహిర్గతం కావాల్సి ఉంది. ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వివాదం తలెత్తడానికి ప్రధాన కారణం.. గత ప్రభుత్వంలో ఉన్న ప్రముఖులు మౌనంగా ఉండటమే. అప్పట్లో ప్రభుత్వాధినేతను కూడా తప్పుదోవ పట్టించారు. అందుకే వివాదం తలెత్తింది. వేద పండితులతో కమిటీ వేయమని గతంలోనే చెప్పినా.. దానినీ అమలు చేయలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. పాత పద్ధతిని (సనాతన ధర్మం) పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలి.