కనిపించని ఓటరు చైతన్యం
భద్రాద్రి జిల్లాలో తగ్గిన పోలింగ్ శాతం
అసెంబ్లీతో పోలిస్తే ఎంపీ ఎన్నికల్లో తగ్గుముఖం
భద్రాద్రి కొత్తగూడెం, మే 14 (విజయక్రాంతి): ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమిషన్ ఎంత ప్రయత్నించినా ప్రజల్లో మార్పు రావడం లేదు. ఓటర్లలో చైతన్యం రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గతేడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా ఓటర్లు ఉత్సాహంగా పాల్గొని ఓట్లు వేశారు. మొత్తం 78.66 శాతం పోలింగ్ నమోదయింది. కానీ పార్లమెంట్ ఎన్నికల విషయానికి వచ్చేసరికి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో 67.93 శాతం మాత్రమే ఓట్లు వేశారు. అధికారులు అనేక కార్యక్రమాలు చేపట్టి నూరు శాతం ఓటింగ్‌కు ప్రోత్సహించినా ఫలితం శూన్యమైంది. అందుకు ప్రధానంగా రాజకీయ పార్టీలు ఓటర్లకు ఎర వేయడం కారణమైంది. కొంతమందికి ఓటుకు నోటు ఇచ్చి, మరికొంతమందికి ఇవ్వకపోవడంతో ఓటర్లలో అనాసక్తి పెరిగిపోయి ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారు. ఫలితంగా ఓటు తమ బాధ్యత అనే అంశాన్ని వారు విస్మరించి డబ్బులు ఇస్తే ఓటు వేద్దాం.. లేకుంటే లేదు అనే పరిస్థితికి వచ్చారు.




